రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ వెనెక చంద్ర వ్యూహాం

పొలిటికల్
 కాంగ్రెస్, టీడీపీ పొత్తు కొంతమందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. అయితే ఈ పొత్తుకు ఏడాది కిందటే బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. రేవంత్‌రెడ్డి టీడీపీని గవీడి కాంగ్రెస్‌లో చేరినప్పడే పొత్తుపొడుపు పొడిచిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ పొత్తు ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనుందని జోరుగా చర్చ సాగుతోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడికి తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు అద్దం పడుతున్నాయి  కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందే టీడీపీ అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకునేవారు. అలాంటిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఈ పొత్తు ఇప్పటికిప్పుడు ఏర్పడిందా..? పరిస్థితులు అలా దారితీశాయా..? అనే అంశాలు నిశితంగా పరిశీలిస్తే పొత్తు చిక్కుముడి అవగతమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయి. ముఖ్యంగా ఏపీలో తమ ప్రభావం తగ్గిపోతుందని తెలిసినా యూపీఏ ప్రభుత్వం తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజనను చకచకా పూర్తిచేసింది. తెలంగాణ ఏర్పాటుకు అతిపెద్ద ప్రాంతీయ పార్టీ టీడీపీ కూడా అంగీకరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విభజన తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయి. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందని భావించారు. అయితే టీఆర్‌ఎస్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్‌లో నాయకత్వలోపం, టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ నాయకత్వం వెరసి తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఆంధ్ర వ్యక్తిగా టీడీపీని ఆంధ్రపార్టీగా టీఆర్‌ఎస్ ముద్రవేసింది. దీంతో తెలంగాణలో కేడర్ ఉన్నప్పటికీ టీడీపీ ఉనికిని అంచలంచలుగా కోల్పోతూ వచ్చింది. తెలంగాణ ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి, ఆంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.
ఈ క్రమంలో ఇరుపార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ నేతనే అవుతారు. ఆంధ్రాలో టీడీపీ గెలిచినా సీఎం చంద్రబాబు అవుతారు. ఈ లెక్కన పొత్తు అనేది అధికారం కోసం కాదు, ఉనికి కోసమేనని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆంధ్రాలో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీకి లాభించే అంశమైతే, ఆంధ్రలో మాత్రం ప్రతికూలం అంశమే. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు తగిన వ్యూహరచన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపై చేస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. ఇదే హామీని చంద్రబాబు బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నారు. ఏపీకి మేలు చేసే పార్టీతో జతకడితే తప్పేంటనే భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించిన సీనియర్ నేతలను కూడా బాబు చాకచక్యంగా బుజ్జగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చారు. గత ఏడాది నవంబరులో అంటే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సమయంలోనే కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఆ సమయంలోనే కాంగ్రెస్‌తో పొత్తు ఆలోచనతో మొదలైందని అంటున్నారు.
రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న రేవంత్‌రెడ్డి (ఫైల్‌)
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు కలిసి జనాలకు అభివాదం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో టీడీపీ, కాంగ్రెస్ మధ్య మైత్రి ఖరారైందని అందరూ చెప్పుకున్నారు. విభజన సందర్భంగా తాము చేసిన తప్పును సరిదిద్దుకుంటామని, ఆంధ్రాకు న్యాయం చేస్తామని ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్ధానాలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. కాంగ్రెస్‌తో పొత్తు మంచిదేనని చంద్రబాబు మున్ముందు ప్రచారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *