భర్తీకి నోచుకోని పోలీస్ సిబ్బంది 

న్యూస్
అనంతపురం జిల్లాలో పోలీసుశాఖ శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి డీఎస్పీ స్థానాలు ఉన్నాయి. పోలీసుశాఖలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో జిల్లా ఎస్పీ తర్వాత  డీఎస్పీలే కీలకం. సబ్‌డివిజనల్‌ స్థాయిలో శాంతిభద్రతలు సజావుగా సాగాలన్నా.. సిబ్బంది సక్రమంగా పనిచేయాలన్నా డీఎస్పీల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. అంతటి కీలకమైన స్థానాలు వెనువెంటనే భర్తీకి నోచుకోవడం లేదు. కీలకమైన స్థానాలకు కూడా డీఎస్పీలు ఉండటం లేదు. ప్రస్తుతం జిల్లాలో స్పెషల్‌ బ్రాంచ్‌ –1 డీఎస్పీ, తాడిపత్రి డీఎస్పీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పోలీసుశాఖలో కీలకమైన డీఎస్పీల పోస్టింగుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలలు గడుస్తున్నా ఖాళీ స్థానాలకు ఖాళీగా ఉన్న డీఎస్పీ స్థానాలకు పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో దీని ప్రభావం శాంతి భద్రతలపై పడనుంది.
మొన్నటి వరకూ కీలకమైన తాడిపత్రి, ధర్మవరం డీఎస్పీ స్థానాలు ఖాళీగా ఉండేవి. ధర్మవరం డీఎస్పీ పోస్టు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొచ్చారు. డీఎస్పీ వేణుగోపాల్‌ ఉద్యోగవిరమణ తర్వాత పుట్టపర్తి డీఎస్పీ రమావర్మ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నెట్టుకొచ్చారు. స్పెషల్‌ డీఎస్పీ శ్రీనివాసులు కళ్యాణదుర్గం డీఎస్పీగా బదిలీ కావడంతో అక్కడున్న వెంకటరమణను ధర్మవరానికి నియమించారు. దీంతో అత్యంత కీలకమైన స్పెషల్‌బ్రాంచ్‌ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఏర్పడింది. అలాగే తాడిపత్రి డీఎస్పీ స్థానం కూడా ఖాళీగా ఉండి దాదాపు ఏడాది కావస్తోంది. ప్రస్తుతం సూపర్‌ న్యూమొరీ డీఎస్పీ అయిన ఎస్సీ, ఎస్టీ సెల్‌–2 డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సూపర్‌ న్యూమొరీ డీఎస్పీలకు లా అండ్‌ ఆర్డర్‌ పోస్టింగులు ఇవ్వడం లేదు. కానీ జిల్లాలో మరో గత్యంతరం లేక సూపర్‌ న్యూమొరీ డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ మహబూబ్‌బాషాకు అప్పగించారు. అనివార్య కారణాల వల్ల తప్పించి మరో డీఎస్పీ విజయ్‌కుమార్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు.ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంటే త్వరలో మరో రెండు డీఎస్పీ స్థానాలు ఖాళీ ఏర్పడనున్నాయి. ఇటీవల పెనుకొండ డీఎస్పీ ఖరీముల్లాషరీఫ్, గుంతకల్లు డీఎస్పీ శ్రీధర్‌కు అడిషనల్‌ ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో వీరికి పోస్టింగ్‌ కల్పించే అవకాశముంది. దీంతో ఈ రెండు స్థానాలు కూడా ఖాళీ ఏర్పడనున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కొత్త డీఎస్పీలు నియమించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. డీఎస్పీల కొరత ప్రభావం శాంతిభద్రతలపై పడుతోంది. పోలీస్‌బాస్‌ అయిన ఎస్పీపై అదనపు భారం పడుతోంది. డీఎస్పీలేని ప్రాంతాలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాడిపత్రి సబ్‌ డివిజన్‌ పరిధిలో నేటికీ మట్కా, పేకాట, బెట్టింగ్‌ తగ్గుముఖం పట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎస్పీ కొరత ప్రభావం శాంతిభద్రతలపై పడే అవకాశముంది. కనుక కీలకమైన స్థానాలకు డీఎస్పీలు భర్తీ చేయడం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *