కొబ్బ‌రినూనె వాడ‌కం మోతాదు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు..!

హెల్త్

అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు ఇంకా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ప‌నిచేస్తుంద‌ని చెప్పి ఈ మ‌ధ్య కాలంలో కొబ్బ‌రినూనెను ఉపయోగించే వారు ఎక్కువై పోయారు. ప‌లు డైట్ల‌లోనూ కొబ్బ‌రి నూనె వాడాల‌ని సూచిస్తున్నారు. అయితే నిజానికి కొబ్బ‌రినూనె ఎంత మాత్రం ఆరోగ్య‌క‌రం కాద‌ని, శృతి మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ప‌లువురు సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

నేటి త‌రుణంలో అనేక మంది ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని చెప్పి కొబ్బ‌రినూనెను విస్తృతంగా ఉప‌యోగిస్తున్నార‌ని, కానీ కొబ్బ‌రినూనె విష‌మ‌ని హార్వార్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెసర్ కారిన్ మిషెల్స్ తెలిపారు. కొబ్బరినూనె శ‌రీరానికి మేలు చేయ‌ద‌ని, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని ఆమె అంటున్నారు. కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిమాణాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరిస్తున్నారు.

సమతుల ఆహారంలో కొబ్బరి నూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతి మించితే హృద్రోగాలు తప్పవని ఆమె తెలిపారు. కొబ్బరినూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొన్నారు. కొబ్బరి నూనెలో 86 శాతం సాంద్రతరమైన కొవ్వు ఉంటుందని, ఇది వెన్నకన్నా మూడోవంతు ఎక్కువని ప్రొఫెసర్ మిషెల్స్ తెలిపారు. సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గుండెజబ్బులు, స్ట్రోక్స్ వ‌స్తాయ‌ని ఆమె అంటున్నారు. కొబ్బరినూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *