పంట నాశనం చేస్తున్న ఏనుగులు

న్యూస్
తిరుపతి :  శేషాచలం అడవుల్లో ఆహారం,నీటి సమస్య ఎదురవడంతో22 ఏనుగులు పల్లెబాట పట్టాయి.అటవీ సమీప పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అరటి, వరి పంటలను ధ్వంసం చేస్తున్నాయి.  తిరుపతి ఫారెస్టు డివిజన్‌ పరిధిలోని ఏనుగుల మంద  రాజంపేట ఫారెస్టు డివిజన్‌లోని రోళ్లమడుగు ప్రాంతం వైపుగా అడుగులు వేశాయి. తోటలు, పంటలపై  దాడులుకు దిగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ప్రతి ఏడాది వేసవిలో నీరు  , ఆహారం కోసం శేషాచల అటవీ ప్రాంతంలోని శివారుగ్రామాల్లో సంచరిస్తూ పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. అటవీశాఖ  అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని  రైతులు ఆవేదన చెందుతున్నారు.ఏనుగుల దాడుల నివారణ కోసం అటవీ శాఖాధికారులు ఎంచుకున్న తాత్కాలిక చర్యలు కంటి తుడుపుగా మారాయి. పంటలు కోల్పోతున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఏనుగుల గుంపు  దిన్నెల, రోళ్ల మడుగు ప్రాంతంలోని అటవీ గ్రామాల పరిధిలో పంటపొలాలపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి గ్రామాల్లోకి రాకుండా రాజంపేట డివిజన్‌ అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.  30మంది సిబ్బందిని నియమించి తప్పట్ల చప్పుడు, బాణసంచా  కాలుస్తూ దట్టమైన అటవీ ప్రాంతంలోకి గజరాజులను తరలిస్తున్నారు.ఇప్పుడు దిన్నెలలో ఏడు, శేషాచలం  ప్రాంతంలో 15 ఏనుగులు సంచరిస్తున్నట్లు  అటవీ అధికారులు చెబుతున్నారు. గ్రామస్తులను అడవిలోకి వెళ్లవద్దని హుకుం జారీచేశారు. పంట నష్టం జరిగితే ప్రభుత్వం  పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని హితువు పలుకుతున్నారు. 2017 మే నెలలో  కుక్కలదొడ్డి, ఎస్‌కొత్తపల్లె, శెట్టిగుంట, కె.బుడుగంటపల్లె, దేశెట్టిపల్లె, లక్ష్మీపురం, వీపీఆర్‌ కండ్రిక  ప్రాంతాల్లో మామిడితోటలు,  మోటార్లు, పైపులను నాశనం చేశాయి.  గత వారంలో ఎస్‌కొత్తపల్లెకు చెందిన నాగేంద్ర అనే రైతు ఏనుగుల దాడిలో గాయపడిన సంగతి విధితమే.శేషాచలం అటవీ ప్రాంతం రాజంపేట, తిరుపతి డివిజన్‌ పరిధిలో విస్తరించి ఉంది. ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. అడవిలో మేత, నీరు లేకపోవడంతో దాహార్తి తీర్చుకోవడానికి రాత్రి సమయంలో ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం.ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు అటవీశాఖ వద్ద బడ్జెట్‌ ఉందని అధికారులు చెపుతున్నారు. అయితే చెల్లింపులో జాప్యం కొనసాగుతోందనే విమర్శలు బాధితరైతుల నుంచి  వినిపిస్తోంది. నష్టాన్ని  సక్రమంగా అంచనా వేయకపోవడంతో రైతులు అపారంగా నష్టపోతున్నారు.ఏనుగుల దాడుల నివారణకు అటవీశాఖ శాశ్వత చర్యలు తీసుకోలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని, పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *