teluguxpress.com

ఈ ప్ర‌పంచం మీ చేతుల్లోకి…

న్యూస్

జ‌నం ఆలోచ‌న‌లు, ఆశ‌యాల‌ను ప్ర‌తిబింబించాల్సిన మీడియా ఆ బాధ్య‌త నుంచి త‌ప్పుకుని చాలా కాల‌మైంది. మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల ఆర్థిక, రాజ‌కీయ ప్ర‌యోజనాలే ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ని మ‌భ్య‌పెట్టేవే వార్తా క‌థ‌నాల‌య్యాయి. దీంతో మీడియా అంటే జ‌నం దృష్టిలో ప‌లుచ‌నైంది. ఒక‌ప్పుడు స‌మాజానికి ఏదైనా చేయాల‌నే త‌ప‌న‌, అభ్యుద‌య భావాలున్న వారు జ‌ర్నలిజం రంగంలోకి వ‌చ్చేవారు. ఇప్పుడు జ‌ర్న‌లిజాన్ని న‌మ్ముకున్న వాళ్ల‌కంటే అమ్ముకునే వాళ్లే ఎక్కువ‌య్యారు. వార్తా ప‌త్రిక‌లు, చానెళ్ల‌ను చూడాలంటే భ‌య‌ప‌డే దుర‌వ‌స్థ‌లో మ‌నం బ‌తుకుతున్నామ‌ని చెప్పేందుకు విచారం వ్య‌క్తం చేస్తున్నాం.

మిర్యాల‌గూడ‌లో కూతురు కులాంత‌ర వివాహం చేసుకొంద‌నే కార‌ణంతో అల్లుని అంత‌మొందించేందుకు హంత‌కుల‌తో కోటి రూపాయ‌ల సుపారి కుదుర్చుకున్న‌ట్టు చానెళ్లు 24 గంట‌లూ క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. ప‌త్రిక‌లకు ఇంత‌కు మించిన ప్రాధాన్య వార్త లేన‌ట్టు రోజుల త‌ర‌బ‌డి వార్తా క‌థ‌నాలు వండారు. మిర్యాల‌గూడ నిందితుడు మారుతీరావు చ‌ర్య‌ను స‌భ్య స‌మాజం ఎండ‌గ‌ట్ట‌డం న్యాయ‌మైంది.

అయితే మీడియా ముసుగులో పాల‌కుల నుంచి ప్ర‌తినిత్యం అడ్వ‌ర్‌టైజ్‌మెంట్స్‌, స్థ‌లాలు, ఇత‌ర‌త్రా ల‌బ్ధి పొందుతూ ప్ర‌జాభిప్రాయాల‌కు భిన్నంగా అన్యాయానికి కొమ్ముకాస్తూ, నిజాల‌కు పాత‌రేస్తూ, నిత్యం ధ‌ర్మాన్ని హ‌త్య చేస్తూ స‌మాజ ప‌త‌నానికి త‌న వంతు కీచ‌క‌పాత్ర పోషిస్తున్నమీడియా మారుతీరావు కంటే వేల‌రెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని విశ్వ‌సిస్తున్నాం. ప్ర‌స్తుతం తెలుగు రాష్ర్టాల్లో మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాల‌కుల గుణం బ‌ట్టి కాకుండా కులం ప్రాతిప‌దిక‌గా మీడియా త‌ప్పుడు క‌థ‌నాల‌తో చేస్తున్న స‌మాజ విధ్వంసం…ఏ అణుబాంబుకు తీసిపోతుందో మేధావులు విశ్లేషించాలి.

అయితే మీడియా ధోర‌ణులు ఇలా ఉండ‌కూడ‌ద‌ని నిందిస్తూ నిత్య అసంతృప్తితో గ‌డ‌పాల్సిందేనా అనే ప్ర‌శ్న ఎప్ప‌టికప్పుడూ నిల‌దీస్తోంది. ఆ ప్ర‌శ్న‌, నిల‌దీత‌, అంత‌ర్మ‌థ‌నం నుంచి ఆవిర్భ‌వించిన‌దే “తెలుగుఎక్స్‌ప్రెస్‌. కామ్” అనే న్యూస్ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్ సుపారీలు తీసుకొని నిజాల‌ను పాత‌రేయ‌ద‌ని మీకు తెలియ‌జేసుకుంటున్నాం. న్యూస్ అన్నా, వెబ్‌సైట్ అన్నా ఇలా ఉండాల‌ని ప‌ది మందికి గ‌ర్వంగా చెప్పుకునేలా తెలుగుఎక్స్‌ప్రెస్‌ను తీర్చిదిద్దుతామ‌ని మీకు హామీ ఇస్తున్నాం.

మీ అంద‌రి స‌హ‌కారంతో ఈ వెబ్‌సైట్ త‌నకంటూ ప్ర‌త్యేక వ్య‌క్తిత్వాన్ని, అస్తిత్వాన్ని సంత‌రించుకుంటుంద‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నాను. ఇందు కోసం మీ నుంచి మాట లేదా రాత రూపంలో స‌మాచారాన్ని అశిస్తున్నాం. మీరందించే ఒక మాట లేదా ప‌ద స‌మాచారంతో వంద అక్ష‌రాల క‌థ‌న మాల‌ను పొందిక‌గా తీర్చిదిద్ది వెబ్‌సైట్ మెడ‌లో అలంక‌రిస్తామ‌ని హామీ ఇస్తున్నాం. ఈ వెబ్‌సైట్ సామాన్యుల‌ది. సామాన్యుల కోసం, సామాన్యుల చేత అసామాన్య సంగ‌తుల‌ను ప్ర‌పంచ ముంగిట ఉంచేందుకు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకొస్తోంది. “ఈ ప్ర‌పంచం మీ చేతుల్లో నినాదం”తో గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని అక్టోబ‌ర్ 2న గ్లోబ‌ల్ ప్ర‌పంచంలోకి అడుగిడుతున్న‌ ఈ వార్తా శిశువును నిండు హృద‌యాల‌తో ఆశీర్వ‌దించ‌డంతో పాటు అక్కున చేర్చుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రినీ వేడుకొంటూ…

ఇట్లు
మీ

సొదుం ర‌మ‌ణారెడ్డి

మ‌రియు సంపాదకీయ స‌భ్యులు

2 thoughts on “ఈ ప్ర‌పంచం మీ చేతుల్లోకి…

  1. మిత్రమా,
    శుభాకాంక్షలు. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరు కుంటున్నాను. ఇందుకు నావంతు కృషిగా అవసరమైన పనిని చేస్తాను. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలపండి… రాజశేఖర రెడ్డి, ప్రొద్దుటూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *