murders in road

పరువు హత్యలు-పరువు తక్కువ ప్రసారాలు

గాసిప్స్

మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ఇక్ష్వాకుల కాలంలో ఉన్నామా? అన్న ఆలోచన కూడా లేకుండా తమ అజ్ఞానాన్ని వీక్షకులకు ఇంజెక్టు చేస్తూ, ప్రణయ్ హత్య, సందీప్ పై, మాధవి పైన హత్యాయత్నంలాంటి సంఘటనలకు ఊతమిస్తున్నాయి.


murder pranai
తెలుగు ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక పరువు హత్య, మరొక పరువు హత్యాయత్నం మానవ సంబంధాలను మరొక సారి చర్చకు తీసుకొచ్చాయి. వైశ్యకులానికి చెందిన అమృత, ఎస్సీ కులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్(24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీన్ని పరువు తక్కువగా భావించిన అమృత తండ్రి, బిల్డర్ మారుతీరావు కిరాయి హంతకులతో గ‌త నెల  14న గర్భవతి అయిన అమృత కళ్లెదుటే ప్రణయను మిర్యాలగూడలోనే దారుణంగా నరికి చంపించాడు. ఈ హత్య చేయడానికి మారుతీరావు బీహార్‌కు చెందిన కిరాయి హంతకులకు కోటి రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని సుపారీ కూడా ఇచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది.
తన కుమార్తె అమృతను చిన్నతనం నుంచి ఎంతో ప్రేమగా పెంచానని, అంత ప్రేమగా పెంచిన తన కుమార్తె తన మాటను కాదని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకే ఈ హత్య చేయించానని మారుతీరావు పోలీసు విచారణలో చెప్పాడు. ఈ సంఘటన టీవీ చానెళ్లకు గొప్ప వరంలా మారింది. రాత్రి, పగలు అనకుండా ఇరవై నాలుగు గంటలూ ఈ సంచలనాన్ని చానెళ్లు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. పత్రికలు కూడా రోజులతరబడి పేజీలకు పేజీలు కథనాలు వండి వార్చి వడ్డించాయి.
pranai
 రేటింగ్ పెంచుకోవడానికి చానెళ్లు చేసిన ఈ ప్రసారాల వల్ల, ప్రణయ్ హత్య జరిగిన అయిదు రోజులకే, సెప్టెంబర్ 19వ తేదీన హైదరాబాదులో ఇలాంటిదే మరో దారుణ సంఘటన జరిగింది. ఎస్సీకులానికి చెందిన సందీప్(24), విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి(22) సెప్టెంబర్ 12వ తేదీన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చని మాధవి తండ్రి మనోహరాచారి కుమార్తెను, అల్లుడిని పిలిచి, నడిరోడ్డులో స్వయంగా అల్లుడిపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన కుమార్తె చెయ్యి తెగి పడిపోయేలా కత్తితో దారుణంగా నరికాడు.
murder
  ప్రణయను మామ మారుతీరావు ఎందుకు చంపాడనే టీవీ చానెళ్లు, పత్రికల కథనాల ప్రభావంతో, అతన్ని ఆదర్శంగా తీసుకుని మనోహరాచారి కూడా ఈ దారుణానికి ఒడిగట్టాడు. తమ కుమార్తెల పైన మితిమీరిన ప్రేమతోనే ఇలా చేశామని ఈ రెండ సంఘటనల్లోనూ అమ్మాయిల తండ్రులంటున్నారు. అసలు ప్రేమంటే ఏమిటి? కన్నబిడ్డల ప్రేమను కాదని, కుమార్తె గర్భవతి అని కూడా చూడకుండా అల్లుడిని దారుణంగా నరికి చంపేయించడం, స్వయంగా అల్లుడిని, అడ్డం వచ్చిన కుమార్తెను కూడా నరికేయడానికి సాహసించడం ప్రేమా? లేక పిల్లల సుఖాలను, వారి ఇష్టాఇష్టాలను గౌరవించడం ప్రేమా?  తమ పిల్లలను మనుషులుగా కాకుండా, అమ్మే, కొనే అంగడి సరుకుగానో, సొంత ఆస్తిగానో భావించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
tv show
 ‘ప్రణయ్ ఎంత అందంగా ఉన్నాడు! ఇంత అందమైన అతన్ని చంపడానికి చేతులెలా వచ్చాయి!?’ అంటూ కొన్ని చానెళ్ల యాంకర్లు ధర్మసందేహాలు వ్య‌క్తం చేస్తూ వీక్షకులను ఏడ్పించారు. టీవీ సీరియళ్లు చూసి చూసి, జాలి గుండెలతో కన్నీళ్లు పెట్టుకోవడానికి అలవాటుపడిన మన ప్రజానీకం కూడా “అంతే కదా’ అనుకుంటూ యాంకర్ల సామాజిక స్పృహలోపడి ఓలలాడిపోయారు. సుపారీ తీసుకున్న హంతకులకు అందంగా కనిపిస్తే చంపడానికి చేతులు రావా!? దీని అర్థమేమిటి? అంటే, అందంగా లేని వారిని తేలిగ్గా చంపేయవచ్చు అనేగా!?   సోగ్గా అందంగా తయారైన యాంకర్లు తమ లాగే అందంగా ఉన్న వాళ్లే, ముద్దు ముద్దుగా మాటలొలికే వాళ్లే ఈ లోకంలో ఉండాలనేది వారి భావనా!?
murder show
అర్థం పర్థం లేని ఈ మాటలెందుకు? హంతకులు సుపారీ తీసుకున్నట్టు, చానెళ్లు కూడా రేటింగ్ పెంచుకుని, అడ్వర్టైజ్ మెంట్లనే సుపారీ తీసుకోడానికేనా తెలుగు వీక్షకులను ఇలా చంపేసేది? మన దేశంలో ప్రేమ పెళ్లిళ్లు కొత్తకాదు. పురాణాల్లో కూడా కొత్తకాదు. జాతి, మత, ప్రాంత విభేదాలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనాదిగా వస్తోంది. ఒకే కులంలోనో, ఒకే మతంలోనే, ఒకే జాతిలోనో, లేదా దగ్గరి రక్త సంబం ధీకులనో పెళ్లి చేసుకునే వారికంటే, వేరే కులం, వేరే మతం, వేరే జాతి, దూరపు రక్త సంబంధీకులను పెళ్లి చేసుకోవడం వల్ల ఆరోగ్య కరమైన పిల్లలు పుడతారని వైద్య శాస్త్రం చెబుతోంది.
జాతకాలు చూసేవారు అబ్బాయి ఫలానా నక్షత్రంలో పుట్టాడు, అమ్మాయి ఫలానా నక్షత్రంలో పుట్టింది, ఈ నక్షత్రంతో ఆ నక్షత్రం కలుస్తుందనో, ఆ నక్షత్రంతో ఈ నక్షత్రం కలవదనో నోటికొచ్చింది చెప్పేస్తారు. అసలు వీళ్లకు తెలిసిందల్లా కేవలం 27 నక్షత్రాలు మాత్రమే. 27 నక్షత్రాల మిడిమిడి జ్ఞానంతో ఏమేమో చెప్పేస్తారు. నిజానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? వీళ్లు లెక్కపెట్టగలుగుతారా? చెప్పమనండి చూద్దాం. చానెళ్లు కూడా ఇలాంటి అర్థంపర్థం లేని సిద్ధాంతులను కూర్చోబెట్టి గంటలతరబడి చర్చలు సాగిస్తూ రేటింగ్ పెంచుకుని, వ్యాపార ప్రకటనలనే సుపారీ తీసుకుంటున్నాయి. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి.
murder
మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ఇక్ష్వాకుల కాలంలో ఉన్నామా? అన్న ఆలోచన కూడా లేకుండా తమ అజ్ఞానాన్ని వీక్షకులకు ఇంజెక్టు చేస్తూ, ప్రణయ్ హత్య, సందీప్ పై, మాధవి పైన హత్యాయత్నంలాంటి సంఘటనలకు ఊతమిస్తున్నాయి.

  – ఎ.రాఘవశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *