

బాబు, కేసీఆర్, మోడీ మధ్య ట్రయాంగిల్ ప్రేమ కథ నడుస్తోంది. వీరి ప్రేమ కథ ఆధారంగా ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ముద్దుల మోడీ అని రాంగోపాల్ వర్మ సినిమా తీయాలని, తీస్తే మరో మజ్నులా బ్లాక్బస్టర్ అవుతుందని ఫిల్మ్నగర్లో ఒకటే చర్చ. ఇద్దరు సీఎంల ముద్దుల ప్రేమికుడని రాఘవేంద్రరావు సినిమా తీస్తే బాహుబలి-1,2 రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని రాజమౌళి ఆందోళనట. ఏంటో మన చుట్టూ ఎన్నెన్నో అద్భుతమైన యధార్థ ప్రేమ కథలు సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నగా తిరుగుతుంటే… సినీదర్శకులు ఎండమావుల కోసం మనది కాని లోకం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

బాబుకు కేసీఆర్ అంటే ప్రేమ, కేసీఆర్కేమో మోడీ అంటే ప్రాణం. మోడీ మాత్రం నాలుగేళ్ల బాబు ప్రేమ కౌగిట్లో పారవశ్యంలో మునిగిపాయె. ముద్దూముచ్చటా తీరాక…ఇది దృతరాష్ర్ట కౌగిలి అని మోడీ, బాబు పరస్పరం తిట్ల దిండకానికి దిగారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో బాబు మాటలను ఒక్కసారి పరిశీలించండి. “కలసి వెళ్దామని కోరితే కేసీఆర్ కాదన్నారు. అది జరిగి ఉంటే తెలంగాణలో మహాకూటమి ఆవిర్భావం జరిగి ఉండేది కాదు. మిగిలిన వారెవరూ కలిసే వారు కాదు. తెలంగాణలో మనపార్టీని లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నించింది. రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ కలసి రాలేదు. అవన్నీ పక్కన పెట్టి టీఆర్ఎస్కు స్నేహ హస్తం అందించాను. కానీ మోడీ అడ్డుపడటంతో కేసీఆర్ ముందుకు రావడం లేదు”
తెలంగాణలో పార్టీనే లేకుండా చేయాలనుకున్న కేసీఆర్పై తాను మనసు పారేసుకున్నానని బాబు ప్రకటించారు. ప్రేమ గొప్పదనం అదే కదా. ద్వేషించే వారిని కూడా ప్రేమించే హృదయం బాబు సొంతం. గతిలేక మహాకూటమితో వెళుతున్నామంటున్నా బాబు…సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా తీసుకుని టీఆర్ఎస్తో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడా అని కాంగ్రెస్ సహా కూటమి సభ్యుల అనుమానం. మొత్తానికి బాబు ప్రేమ ఎంత మధురం. కేసీఆర్ హృదయం ఎంత కఠినం.