vijay devaralkond

నోటాలో కేటీఆర్‌ను అనుకరించాను!

సినిమా

విజయ్ దేవరకొండ … తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మారుమ్రోగుతున్నపేరిది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే బ్రాండ్ ఇమేజ్‌ను, స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారాయన. వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి. 

మళ్లీ అర్జున్‌రెడ్డి లుక్‌కు మారినట్టున్నారు?

-డియర్ కామ్రేడ్ చిత్రం కోసం గడ్డం లుక్ అవసరం. అందుకే మళ్లీ గడ్డం పెంచాను. 

తక్కవ సమయంలోనే ఇంత క్రేజ్ రావడం ఎలా అనిపిస్తోంది?ఈ జర్నీ ఎలా వుంది?

-నాకు ఆలోచించడానికి సమయం దొరకడం లేదు. నిదానంగా కూర్చొని మొన్ననే ఒక సినిమా విడుదలై విజయవంతమైంది అని అనుకునే లోపే మరో చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తోంది. ఈ బిజీలోనే టైమ్ గడిచిపోతోంది. ఇక ఈ జర్నీ ఎలా వుంది? నేను ఎక్కడున్నాను? అనేవి ఆలోచించే సమయమే చిక్కడం లేదు. ఈ సినిమా పబ్లిక్ మీట్ కోసం ప్రేక్షకుల మధ్యకు వెళ్లినప్పడు మాత్రం మనకు తెలియకుండానే ఏదో జరుగుతోంది రా అనే భావన కలిగింది. అది మాటల్లో చెప్పలేని భావన. ఇవన్నీ చూస్తున్నప్పుడు సంతోషంతో పాటు చిన్న భయం కూడా కలుగుతుంటుంది. 

సినిమాలు వరుసగా వివాదాస్పదం కావడం ఎలా అనిపిస్తున్నది?

-అది కాంగ్రెస్ పార్టీ వాళ్లను అడగాలి(నవ్వుతూ). నా సినిమాల్ని వాళ్లే ఎక్కువగా వివాదాస్పదం చేస్తున్నారు. వివాదాలు సృష్టించే వాళ్లకు నేను, నా సినిమాలే ఎందుకు దొరుకుతున్నాయో తెలియదు. ఇప్పటికైనా నన్ను వదలండి. వివాదాలు సృష్టించడానికి నేనే దొరికానా? అని చెప్పాలనుకుంటున్నా. నా సినిమాలపై సృష్టిస్తున్న వివాదాల్ని చూస్తే సిల్లీగా అనిపిస్తోంది. 

మీ సినిమాలకు వివాదాలు కలిసొస్తున్నట్టున్నాయి?

-మనం కొనసాగాలంటే వివాదాల్ని కలిసొచ్చేలా చేసుకోవాలి (నవ్వుతూ). నన్ను విమర్శించాలని ప్రయత్నిస్తే ఆ విమర్శల్ని నా ఎదుగుదలకు వాడుకుంటా. 

ఈ సినిమాపై వస్తున్న వివాదాలు రిలీజ్‌కు ఇబ్బందిగా మారే అవకాశం వుందా?

-వివాదాలు నోటా విడుదలకు ప్రతిబంధకంగా మారితే వాటి ద్వారానే సినిమా మరో 20 కోట్లు ఎక్కువగా వసూలు చేసేలా చేస్తా. 

కెరీర్ ప్రారంభ దశలో పెద్ద హీరోలు కూడా రాజకీయ నేపథ్య చిత్రాల్లో నటించలేదు. కానీ కెరీర్ తొలి దశలోనే ఆ అడుగు మీరు వేయడానికి కారణం?

-నోటా కథ ఆసక్తికరంగా అనిపించింది. కథ వినగానే ఇది నేను చేయాలి అనిపించింది. దీని స్థానంలో వేరే చిత్రాలు చేయాల్సిన పరిస్థితి వున్నా వాటిని పక్కన పెట్టి ఈ చిత్రాన్నే చేసేవాడిని. తమిళ రాజకీయాలకు చాలా దగ్గరగా సాగే కథ ఇది. దీన్ని ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత మంచిదనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. 

ఇంతకీ సినిమాలో ఏం చెబుతున్నారు?

-నోటా అనే బటన్ గురించి సినిమాలో చెప్పడం లేదు. అది మా కథకు బాగా పనికొచ్చింది కాబట్టి ఆ టైటిల్‌ను పెట్టాం. ప్రస్తుత రాజకీయాల్లో వున్న వాళ్లెవ్వరూ మాకు నచ్చడం లేదని..మాకు కొత్త ఆప్షన్‌లు కావాలని అసహనం నుంచి వచ్చిందే నోటా. రాజకీయాలంటే తెలియని, ఇష్టంలేని ఓ సాధారణ యువకుడిని బలవంతంగా ముఖ్యమంత్రిని చేస్తే ఆ తరువాత అతను ఎలా ప్రవర్తించాడు? ఏం చేశాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. 

రాజకీయ నేపథ్యంలో వచ్చిన లీడర్, భరత్ అనే నేను చిత్రాలకు నోటా ఎలా భిన్నంగా వుండే అవకాశం వుంది?

-కొన్ని విషయాల్లో పోలిక వున్నా వాటికి పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌కు జరిగిన, జరుగుతున్న సంఘటనలను జోడిస్తే ఎలా వుంటుందన్నదే ఈ చిత్రం. సహజత్వానికి చాలా దగ్గరగా వుంటుంది. 

తమిళ రాజకీయాలకు చాలా దగ్గరగా వుంటుందని చెప్పడానికి కారణం?

-ఇటీవల జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. ఈ కథ విన్నప్పుడు నాకు తమిళ రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ఆ తరువాతే తెలుసుకున్నాను. సినిమాలో చర్చించే అంశాల వెనక ఇంకా ఎలాంటి సంఘటనలున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశాను. సినిమాలోని చాలా సన్నివేశాల్లో అక్కడ నిజంగా నేనే వుంటే ఎలా చేసుండేవాడినో అనుకుని చాలా వరకు మార్చుకుని నటించాను. డైలాగ్‌లు కూడా కొన్ని నేనే చెప్పాను. తెలుగులో అయితే చాలా వరకు మార్చుకుని చేసేవాడిని. నాకు తమిళ్ కొత్త కావడంతో ప్రతీ ఎమోషన్ గురించి ప్రాపర్‌గా తెలుసుకుని ఆ ఎమోషన్‌ను పండించడానికి ప్రయత్నించాను. 

నోటా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వుందనే విమర్శలు వినిపిస్తున్నాయి?

-మా పార్టీ కంటే నోటా బెటర్ అని భయపడేవాళ్లే మా సినిమాపై విమర్శలు చేస్తున్నారు. తమపై తమకు నమ్మకం వున్న వాళ్లు ఎలాంటి వివాదాలు సృష్టించడం లేదు. రేపు సినిమా విడుదల తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. 

తొలిసారి సీఎం పాత్రలో నటించడం ఇబ్బందిగా అనిపించలేదా?

-అవన్నీ నాకు తెలియదు. కథ నచ్చింది మరో ఆలోచన లేకుండా నటించాను అంతే. నాకు ఇమేజ్ అంటే నచ్చదు. 
గత కొన్ని రోజులుగా మీరు ఓ అమ్మాయితో వున్న ఓ ఫొటో సోషల్ 

మీడియాలో వైరల్ అవుతోంది?

-ఆ అమ్మాయి మీకు నచ్చిందా?. ఆమె చాలా మంచి అమ్మాయి. నేను పబ్లిక్‌లో వున్నాను కాబట్టి నా గురించి ఏమైనా రాస్తారు. నాకు సంబంధించిన వాళ్లకు అది నచ్చనప్పుడు వాళ్లను ఇందులోకి లాగడం మంచిది కాదని నా ఫీలింగ్. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో రెండేళ్ల క్రితంది. ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ ఫొటోలో వున్నది నేనే. దాని గురించి అంతా మర్చిపోతారులే అని గత నెల రోజులుగా ఎదురుచూస్తున్నాను. 

తదుపరి చిత్రాల గురించి?

-క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. దాని తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయాలనుకుంటున్నాను. నోటా ఫలితాన్ని బట్టి ఆ సినిమా వుంటుంది. 

నోటాలో కేటీఆర్‌ను అనుకరించా!

విజయ్ దేవరకొండ.. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొంత బ్రాండ్ హీరో. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్.. తాను నటించి తాజా చిత్రం నోటాలో యువ రాజకీయ నేతగా కనిపించడానికి తెలంగాణ యువనేత కేటీఆర్‌నే అనుకరించానంటున్నారు. శుక్రవారం నోటా సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతం గా కేటీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. చాలా విషయాల్లో కేటీఆర్ మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేశానని, తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగా నచ్చిందని అన్నారు. 

యువ రాజకీయ నేతగా కనిపించడానికి ఏ రాజకీయ నాయకుడిని అనుకరించారు?

-తెలంగాణ యువనేత కేటీఆర్‌గారినే. ఆయన లుక్‌ని యథావిధిగా అనుకరించాను. కొన్ని సన్నివేశాల్లో యాజిటీజ్‌గా ఆయన్నే దించేశాను. వ్యక్తిగతంగా కేటీఆర్ అంటే చాలా ఇష్టపడతాను. 

వ్యక్తిగతంగా మీకు నచ్చిన ముఖ్యమంత్రి?

-చిన్నతనంలో చంద్రబాబు నాయుడు లీడర్ షిప్ అంటే ఎక్కువగా ఇష్టపడేవాడిని. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న సిస్టమ్ నాకెంతగానో నచ్చింది. ప్లాస్టిక్ మానేద్దాం అని మీడియా ముందు రాజకీయ నాయకులు చెబుతుంటారు. కానీ తరువాత రోజు అదే నాయకులు ప్లాస్టిక్ బాటిల్స్‌ని వాడుతుంటారు. కానీ కేటీఆర్ మాత్రం అలా కాదు. కెమెరా ముందు..కెమెరా వెనుక ఒకేలా ఆలోచిస్తుంటారు. ఓ సందర్భంలో మా ఇంటికి వచ్చిన ఆయన నువ్వు హీరోవి. ఖాదీ గురించి ప్రచారం చేయొచ్చుకదా. వారానికి ఒకసారైనా ఖాదీ బట్టలు వేసుకుని ప్రచారం చేస్తే బాగుంటుంది. షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు ప్లాస్టిక్‌ను నిషేధించి ఆ స్థానంలో కాపర్ వస్తువుల్ని వాడుఅని చెప్పారు. ఆ మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి. దాంతో ఆయన చెప్పినట్టే చేయడం మొదలుపెట్టాను.

రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు?

-గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేశాను. తెలంగాణ ప్రభుత్వ పనితీరు నాకు బాగా నచ్చింది. వాళ్లు సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *