అవులెయ్ అంటే ఇదే విజ‌య‌సాయి

పొలిటికల్
సామాజికంగా, రాజ‌కీయంగా ఉన్న‌త‌స్థాయిలో ఉన్నంత మాత్రాన స‌రిపోదు. దానికి త‌గ్గ‌ట్టు మ‌స‌లుకున్న‌ప్పుడే గౌర‌వం ద‌క్కుతుంది. అంతేకాదు స్థాయికి త‌గ్గ‌ట్టు మాట్లాడిన‌ప్పుడే ఆ మాట‌ల‌కు, వ్య‌క్తుల‌కు విలువ ల‌భిస్తుంది. లేదంటే స‌మాజ దృష్టిలో ప‌లుచ‌న కావ‌డం ఖాయం. ఇప్పుడీ ఉపోద్ఘాత‌మంతా వైసీపీ ముఖ్య‌నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి గురించే. ఢిల్లీలో పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్న‌ప్పుడు మాత్రమే అక్క‌డ కాస్త హ‌డావుడి చేస్తూ క‌నిపిస్తుంటాడు. టీడీపీ మాట‌కు వివాదాస్ప‌ద తూటా పేల్చుతూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తుంటాడు. బ‌హుశా ఆయ‌న‌కు ఇలాంటి గుర్తింపే న‌చ్చిన‌ట్టుంది.
పాల‌క‌ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం స‌హ‌జ‌మే. అయితే విమ‌ర్శ‌ల్లో శ్రుతి మించుతోంది. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేమీ లేవ‌నుకోండి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దొంగ‌ని, నాలుగున్న‌ర ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి సోమ‌వారం విశాఖ‌లో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. విజ‌య‌సాయి లెక్క ప్ర‌కారం ఏడాదికి ల‌క్ష కోట్లు చొప్పున చంద్ర‌బాబు దోచుకున్నార‌న్న మాట‌. 
ఈ ఒక్క ఆరోప‌ణ‌తో విజ‌య‌సాయి విడిచిపెట్ట‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడితే చంద్ర‌బాబు దేశం విడిచి వెళ్లిపోవాల‌ని చూస్తున్నార‌న్నారు. కావున చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ దేశం విడిచి వెళ్ల‌కుండా కేంద్ర‌ప్ర‌భుత్వం పాస్‌పోర్టును ర‌ద్దు చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుని ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌లేద‌ని మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు కూడా విజ‌య‌సాయిరెడ్డి ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు.
చంద్ర‌బాబు ఇంట్లో ఆ ఆభ‌ర‌ణాలున్నాయ‌ని, 24 గంట‌ల్లో త‌నిఖీ చేస్తే ప‌ట్టుబ‌డుతాయ‌ని, లేదంటే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. ఈ రెండు సంద‌ర్భాల్లో విజ‌య‌సాయి చేసిన విమ‌ర్శ‌లు మీడియాలో ప‌తాక శీర్షిక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు. అంత‌కు మించి స‌భ్యుల హుందాత‌నాన్ని పెంచ‌క‌పోగా మ‌రింత దిగ‌జారుస్తాయి. మ‌రీ ఇంత అవులెయ్ (వెట‌కారం) ప‌నికి రాద‌ని విజ‌య‌సాయిరెడ్డి తెల్సుకుంటే ఆయ‌న‌కే మంచిది. అందులోనూ జ‌గ‌న్ కేసులో నెల‌ల త‌ర‌బ‌డి జైల్లో ఉన్న వ్య‌క్తి ఆరోప‌ణ‌ల‌కు ఎలాంటి విలువ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *