Hello Guru Prema Kosame

హ‌లో గురూ… పాత క‌థ‌!

సినిమా

-జీఆర్ మ‌హ‌ర్షి
ఓ 80 ఏళ్ల క్రితం జ‌ర్మన్ ర‌చ‌యిత బ్రెహ్ట్ చిన్న న‌వ‌ల రాశాడు. హీరో ఒక అతిథిగా హీరోయిన్ ఇంటికొస్తాడు. ఆ స‌మ‌యానికి హీరోయిన్ నిశ్చితార్థం జ‌రుగుతూ ఉంటుంది. త‌ర్వాత హీరోహీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ . చివ‌రికి ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు.

ఈ పాటికి మీకో తెలుగు సినిమా గుర్చొచ్చి ఉండాలి. మీ జ్ఞాప‌కం క‌రెక్ట్‌. నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాలోని కొన్ని సీన్లు అటూఇటూ చేసి దానికి నువ్వేనువ్వు, నేను శైల‌జ (ఇంకా చాలా ఉన్నాయి. పేర్లు గుర్తు రావ‌డం లేదు) క‌థ‌ల్ని మిక్సీలో వేసి రుబ్బితే హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే పుడుతుంది.

కొత్త క‌థ‌లు ఎక్కడ్నుంచి వ‌స్తాయి బాస్‌, అబ్బాయి అమ్మాయి, వారి మ‌ధ్య అదే ప్రేమ‌. దానికి అడ్డు ఎవ‌రు తగులుతారు? కులం, మ‌తం , డ‌బ్బు, పెద్ద‌వాళ్లు. రోమియో జూలియ‌ట్ కాలం నుంచి జాన‌ర్ ఇదే క‌దా, మ‌రి క‌థ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి?

సినిమా తీయాలంటే ఏడాది క‌ష్టప‌డాలి. బోలెడు డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాలి. ఈ స‌మీక్షకులు, విమ‌ర్శకులు రెండు గంట‌ల్లో సినిమా చూసి పెన్నుతో క‌సక‌స పొడుస్తారు. ద‌ర్శకులు, హీరోల బాధ ఇది. మ‌రి చీమక‌ష్టాలు చీమ‌కి కూడా ఉంటాయి.

ఉద‌యం 6 గంట‌ల‌కు లేచి, 7 గంట‌ల‌కు రెడీ అయ్యి, క్యాబ్ మాట్లాడుకుని ప్రసాద్ ఐమాక్స్ వ‌ర‌కూ వెళ్లి, టీ, కాఫీ, పాప్‌కార్న్ స‌రే. ఓ ఐదు గంట‌ల టైం, ఐదువంద‌ల డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకొని థియేట‌ర్‌లో కూర్చుంటే మొద‌టి రెండు సీన్స్‌తోనే మ‌నం పాత సినిమాకి వ‌చ్చామా? లేదా టీవీ ముందు కూచున్నామా అని సందేహం వ‌స్తే ఏం చేయాలి? పెన్నుని గిర‌గిరా తిప్పాలా వ‌ద్దా? తిప్పితే బాధ‌ప‌డ‌తారు. బాగా తీయ‌మంటే తీయ‌రు.

విమ‌ర్శించ‌డం ఎవ‌డైనా విమ‌ర్శిస్తాడు. నెల‌ల త‌ర‌బ‌డి క‌థ మీద కూచుని, నాలుగైదు డైలాగ్ వ‌ర్షన్స్ రాసుకుని, ఓ యాభై మంది టీంని కంట్రోల్ చేస్తూ సినిమా తీయ‌మ‌నండి చూద్దాం. సినిమా తీయ‌డం విమ‌ర్శకుడి ప‌నికాదు. వైన్ త‌యారు చేయాలంటే చాలా క‌ష్టప‌డాలి.

ఎంతో మంది క‌ష్టప‌డితే వ‌చ్చిన వైన్‌ని ఒక గుక్క టేస్ట్ చేసి దాని క్వాలిటీని వైన్ టేస్టర్స్ (వైన్ రుచి చూసేవాళ్లు) తేల్చేస్తారు. యూర‌ప్‌లో ఇది చాలా పెద్ద ప్రొఫెషన్. సినీ విమ‌ర్శకుడు కూడా వైన్ టేస్టర్ లాంటివాడు. కానీ వాడికి ఎప్పుడో త‌ప్ప వైన్ దొర‌క‌దు. నాటుసారాయి రుచిచూపించి దాన్ని వైన్‌గా అనుకోమంటారు. సారా వ‌ల్ల కూడా కొంద‌రికి కిక్ రావ‌చ్చు. కానీ అంద‌రి ఒంటికి ప‌డ‌దు.

రివ్యూ రాయ‌డ‌మంటే వైన్‌, సారా అంటున్నాడేంటి, పండ‌గ క‌దా… ఔష‌ధం సేవించాడా ఏంటి అని సందేహం రావ‌చ్చు. ఎంత డోస్ పెంచినా సినిమా వాళ్లు మార‌రు క‌దా! హ‌లో గురూ సినిమా జ‌స్ట్ ఒక డ్రామా. ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి డ్రామా ఎలా ముగుస్తుందో మ‌న‌కు తెలుస్తుంది. సినిమా అంటేనే డ్రామా క‌దా, ఇంకేం కావాలి?

మాకు తెలియ‌ని క‌థ‌ని కొత్తగా చెప్పండి, తెలిసిన క‌థ‌యినా ప‌ర్లేదు… అదైనా కొత్తగా చెప్పండి. అరిగిపోయిన క‌థ‌ని చెప్పకండి. హీరో హీరోయిన్ ఇంటికి వ‌స్తాడు. వెంట‌నే ల‌వ్ స్టార్టయితే బావుండ‌ద‌ని ప్రణీత‌తో కాసేపు ల‌వ్‌, సాంగ్‌.

హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్ మంచివాడు. మాట మీద నిల‌బ‌డే వాడు. ప్రకాశ్‌రాజ్ ఇలాంటి పాత్రలు ఎన్ని చేశాడంటే, ఒక‌వేళ ఆయ‌న డైలాగ్‌లు మ‌ర‌చిపోయి, పాత సినిమాల్లో త‌న డైలాగులు చెప్పినా మ‌నం క‌నిపెట్టలేం. రామ్‌, ప్రకాశ్‌రాజ్ మ‌ధ్య జ‌రిగే క‌థే సినిమా.

రామ్ చాలా ఎన‌ర్జటిక్‌గా ఉన్నాడు. సోక్రటీస్ మంచిత‌త్వవేత్త అని చెప్పడం ఎంత తెలివి త‌క్కువ త‌న‌మో, ప్రకాశ్‌రాజ్ బాగా న‌టించాడు అన‌డం కూడా అలాంటిదే. ఆయ‌న బాగా న‌టించ‌క‌పోవ‌డం అనేది ఎప్పుడూ ఉండ‌దు. ద‌ర్శకుడు త్రినాథ‌రావ్ క‌మ‌ర్షియ‌ల్ ప‌ల్స్ తెలిసిన‌వాడు.

నాట‌కాల్లో ఫోక‌సింగ్ లైట్స్ ఉంటాయి. స్టేజీ ఒక‌టే. కానీ రంగులు మారుతుంటాయి. ఈయ‌న ద‌గ్గర ఒక‌టే క‌థ ఉంది. ఫోక‌స్ లైట్స్ మారుతాయి అంతే. ఈ సినిమాకి నాన్న‌, ఒక కూతురు, ఒక ప్రేమికుడు అని పేరు పెడితే బాగుండేది. నాన్న చెప్పిన‌ట్టు వినే కూతురు క‌థ‌లో ఉంటే మ‌న‌కు ఫ్లస్ ఏమంటే ఇక ఆ అమ్మాయిలో యాక్టింగ్ చేయించే ప‌నిలేదు. ఊరికే ఫ్రేమ్‌లో నిల‌బెడితే చాలు. అనుప‌మ ప‌రిస్థితి కూడా ఇదే.

అక్కడ‌క్కడ కామెడీ బాగుంది. డైలాగులు చాలాచోట్ల బావున్నాయి. కానీ డైలాగులు క‌ర్రీకి తిరుగుమోత లాంటివి. క‌ర్రీ బావుంటే అద‌న‌పు రుచిని తిరుగుమోత ఇస్తుంది. క‌ర్రీలేక‌పోతే ఎవ‌రేం చేయ‌లేరు. త్రివిక్రమ్ కూడా ఒక్కోసారి డైలాగ్‌ల అర‌ణ్యంలో ఇరుక్కుని దారి తప్పుతాడు. ఈ సినిమాలో డైరెక్టర్ త్రినాథ‌రావు అయితే మాట‌ల ర‌చయిత ప్రస‌న్నకుమార్‌. ఇద్దరూ కూడా డైలాగుల సాయంతో గ‌ట్టెక్కాల‌ని చూశారు. ఎక్కుతారో లేదో తెలియ‌దు.

ప్రతి ప‌దేళ్లకోసారి కొత్త జ‌న‌రేష‌న్ వ‌చ్చి ప్రేమ‌లో చిక్కుకుంటుంది. కాబ‌ట్టి ఈ ప్రేమ క‌థ కోసం కావ‌చ్చు, క‌నెక్టయితే దిల్‌రాజ్ అదృష్టం. ఆయ‌న మాస్టర్ చెఫ్‌. అందులో సందేహం లేదు. ఎన్నో పండ‌గ‌ల‌కి అద్భుత‌మైన విందు భోజ‌నాలు పెట్టిన వ్యక్తి. కానీ ఈ మ‌ధ్య ఉప్పుకారం మ‌ర‌చిపోతున్నాడు. మా బిపి పెంచే సినిమాలు కావాలి కానీ, బిపి పేషెంట్లకి వ‌డ్డించే చ‌ప్పిడి మాకు అక్కర్లేదు సార్‌.

చాలా క‌థ‌లు వింటున్నాన‌ని హీరో రామ్ ఈ మ‌ధ్య ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. చాలా క‌థ‌లు క‌లిపి ఒకే క‌థ‌గా మారిస్తే తెలుసుకోలేక పోయాడు. క‌థ‌ల్ని కిచిడీలుగా వండుకోండి, నో ప్రాబ్లం. కానీ స్ట‌వ్ వెలిగించ‌డం మ‌రిచిపోతున్నారు. అదీ ప్రాబ్లం.

రేటింగ్ : 2.25/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *