Kcrku gatti potinicchena

గ‌జ్వేల్‌లో కేసీఆర్‌పై “ప్రతాపం” చూపుతారా?

పొలిటికల్

గజ్వేల్లో కేసీయార్ గట్టి పోటీ ఎదుర్కోబోతున్నార‌ని పాత మెదక్ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఈ ద‌ఫా కేసీఆర్‌పై ఒంటేరు ప్రతాప‌రెడ్డి త‌న ప్రతాపం చూపుతారా అనే విష‌య‌మై ఆస‌క్తి నెల‌కొంది. 2014లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న కేసీయార్ కు ఇక్కడి నుంచి కేవలం 19 వేల పైచిలుకు మెజారిటీ దక్కింది. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వంటేరు ప్రతాపరెడ్డికి 67,154 ఓట్లు రాగా కేసీయార్‌కు 86,372 ఓట్లు దక్కాయి. ఇది మొత్తం పోలైన ఓట్లలో 44.06 శాతానికి సమానం. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన తూముకుంట నర్సారెడ్డికి 34 వేల ఓట్లు దక్కాయి. ఎన్నికల అనంతరం ఇక్కడి రాజకీయ ముఖ చిత్రం మారింది.

ఒంటేరు ప్రతాపరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండగా నర్సారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. ఒంటేరుకే కాంగ్రెస్ టికెట్ దక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీయార్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఒంటేరు బలమైన నేతగా ఎదిగారని, నియోజకవర్గ వ్యాప్తంగా కేడర్ ను పెంచుకున్నారని మెదక్ జిల్లాలో చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి ఫాంహౌజ్ ఉన్న ప్రాంతంలో కొంత అభివృద్ధి చోటు చేసుకున్నప్పటికీ చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గానీ, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం గానీ జరగలేదని, దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కేసీయార్ గజ్వేల్తో పాటు మేడ్చల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో వాస్తవమేదీ లేదని టీఆర్ఎస్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. కేసీయార్ మెజారిటీ ఈసారి మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

కానీ కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోటీ చేస్తుండడంతో కేసీయార్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని, తద్వార కేసీయార్ విజయవకాశాలపై ప్రభావం ఉంటుందని లోలోన ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంతమంది నేతలను ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయించి ఓట్లను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని జిల్లా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *