cm babu

కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా కూట‌మి అడుగులు

న్యూస్

తెలంగాణలో శాసనసభకు జరుగుతున్న ఎన్నికలపై టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబునాయుడు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కూటమిలో చిటపటలను చల్లార్చడానికి చొరవ కనబర్చారు. ప్రత్యక్షంగా తాను కనిపించనప్పటికీ పరోక్షంగా కూటమిని బలోపేతం చేయడానికి, టీడీపీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి వ్యూహాత్మకంగా కీలక భూమిక పోషిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాలు, శాసనసభ ఎన్నికలు, పార్టీల బలాబలాలు, ప్రజల మనోభావాలపైన నిర్దిష్టమైన సర్వే జరిపించారు.

సీట్ల కంటే పొత్తు ముఖ్యం, గెలుపే ముఖ్యంగా కూటమి పనిచేయాలి, భాగస్వామ్య పక్షాల మధ్య రాజకీయ అవగాహన అత్యంత ప్రధానం, టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితిలో చీలడానికి అవకాశం ఉండరాదు, అంతా సంఘటితంగా ముందుకు సాగడంతోనే అనుకున్న ఫలితాలను రాబట్టగ లుగుతాము అని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌పై ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇటీవల‌ కాంగ్రెస్ బాగా బలం పుంజు కుందని, తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నందున కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి కలిసికట్టుగా ముందుకు సాగడంతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చవలసి ఉంటుందని ఇటీవల తనను కలిసిన టీడీపీ ముఖ్యనేతతో చంద్రబాబు అన్నట్లు తెలిసింది.

కూటమిలో సీట్ల వ్యవహారం తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతతో కూడా చంద్రబాబు మాట్లాడారని అంటున్నారు. మరిన్ని వివరాల ను దశల వారీగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యం మేరకే కాంగ్రెస్ సారథ్యంలోని కూటమితో కలిసి వెళ్లవలసిన అవసరం ఉందని తెలుగు తమ్ముళ్లకు వివరించారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫె సర్ కోదండరాంతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. సీట్ల కోసం పేచీ పెట్టడం కంటే కూడా గెలిచే సీట్ల విషయం అలోచించాలని సూచించినట్లు తెలిసింది.

తాను నిర్వహించిన సర్వే, వివిధ పార్టీల బలాబలాలు, ప్రజాభిప్రాయం, అధికార టీఆర్‌ఎస్ బలం, బలహీన తలను వివరించిన తర్వాత కోదండరాం కూడా మెత్తబడ్డారని అంటున్నారు. ఒకదశలో టీడీపీ రెండు సీట్లు తగ్గించుకొని టీజేఎస్‌కు రెండు సీట్లు పెంచేందుకు కూడా చంద్రబాబు ముందుకొచ్చాడని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కూటమి కలిసి కట్టుగా ఎన్నికల్లో పాల్గొన్న పక్షంలో అధికారంలోకి రావడం ఖాయమనే విధంగా చంద్రబాబు నేతలతో మాట్లాడుతున్నాడని అంటున్నారు.

ఆరు నూరైనా తెలంగాణలో కేసీఆర్‌ను గద్దేదించాల్సిందే అనే దృఢ సంకల్పంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలుగు తమ్ముళ్లు వెల్లడించారు. అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఒకేసారి 105 మంది సిట్టింగ్‌లను తిరిగి బరిలోకి దింపడంతో సగానికి పైగా అభ్యర్ధులపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, కొందరు అభ్యర్దులను ప్రజలు తమ గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారని, మరి కొందరిని నిలదీస్తున్న సంఘటనలు కూడా నిత్యం చూస్తూనే ఉన్నామని చంద్ర బాబునాయుడు తనను కలిసిన నేతతో అన్నట్లు తెలిసింది.

కూటమిలో సీట్ల పంపిణీ వ్యవహారం కూడా చంద్రబాబునాయుడు జోక్యంతో ఒక కొలిక్కి వచ్చిందంటున్నారు. టీడీపీ 35, టీజేఎస్ 15, సీపీఐ 10 సీట్ల కోసం పట్టుబడుతున్న విష యాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు జోక్యం చేసుకొని అన్ని పక్షాలతో మాట్లాడిన తర్వాత టీడీపీ 15, టీజేఎస్ 10, సీపీఐ 4 స్ధానాలలో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ 90 స్దానాల్లో పోటీ చేయడానికి సిద్దపడినందున మిత్రపక్షాలు సర్దుకుపోవడానికి సుముఖత వ్యక్తం చేశాయంటున్నారు. సీట్ల ప్రకటన కూడా ఉమ్మడి వేదిక మీదుగా వెలువడే అవకాశం ఉందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *