Pedana-tdp

మచిలీపట్నంలో టీ”ఢీ”పీ

పొలిటికల్

ఆయ‌న టీడీపీ ఎంపీ. సీనియ‌ర్ నాయ‌కుడు. వ‌రుస విజ‌యాల‌తో హోరెత్తుతున్న బీసీ వ‌ర్గానికి చెందిన నేత‌. నిజానికి విన‌యానికి ఏదైనా పేరుంటే.. అది ఆయ‌నే! అయితే, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వ‌చ్చే ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో అధికార టీడీపీలో టికెట్ల ర‌గ‌డ ప్రారంభ‌మైంది. మాకు కావాలంటే.,. మాకు కావాలంటూ.. టికెట్ల కోసం నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని ఉవ్విళ్లూరుతున్న నాయ‌కుల సంఖ్యకూడా పెరుగుతోంది. ఇదే క్రమంలో ఈ ఎంపీ కూడా త‌న కుమారుడికి టికెట్ ఇస్తారా? లేదా? అంటూ భీష్మిస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. మ‌చిలీప‌ట్నం ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌.. టీడీపీలో చాలా సీనియ‌ర్‌. చంద్రబాబుకు అత్యంత విధేయుడు కూడా. చాలా సౌమ్యంగా, త‌న ప‌నేదో తాను చేసుకుని పోయే నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. 2009లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలులు బ‌లంగా వీచినా మ‌చిలీప‌ట్నంలో మాత్రం ఆయ‌న ఎంపీగా విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా అక్కడ నుంచే రెండోసారి గెలిచారు. అయితే, వ‌చ్చేఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం నుండి తన కుమారునికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారు.

మిగిలిన ఎంతోమంది సీనియ‌ర్ల వార‌సుల‌కు చంద్రబాబు టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుండ‌డంతో ఈయ‌న కూడా త‌న వారసుడిని రంగంలోకి దింపాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. అయితే, పెడ‌న‌లో ఈయ‌న‌కు సొంత పార్టీ నేత‌ల నుంచే వ్యతిరేక గాలులు వీస్తుండ‌డం గ‌మ‌నార్హం. గతంలో పెడన మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడానికి.. నారాయణరావు కారణమని ఎమ్మెల్యే కాగిత అనుచరులు బాహాటంగానే ధ్వజమెత్తారు. పార్టీ అభ్యర్థిని తానెందుకు ఓడిస్తానని.. ఇదంతా ఒక కుట్ర, టీడీపీ కౌన్సిలర్లు నమ్మించి.. పార్టీని ముంచి అమ్ముడు పోయారు.. తనపై దుష్ప్రచారం చేయడం తగదని నారాయణరావు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.

అదేస‌మ‌యంలో త‌నపై ఉద్దేశ పూర్వకంగానే ప్రచారం చేస్తున్నార‌ని, ఏదేమైనా.. మ‌చిలీప‌ట్నం ఎంపీగా తాను, పెడన నుంచి తన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీచేయడం ఖాయమని నారాయణరావు చెబుతున్నారు. నిన్నకాక మొన్న కళ్లు తెరిసిన నారాయణరావుకే ఈ అభిప్రాయం ఉంటే… ముప్పయి సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్న కాగితకు ఎంత ఉండాలి అని ఆయన అనుచరులు ఎదురుదాడి చేస్తున్నారు.

కాగిత మాత్రం గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న‌కు మంత్రిప‌ద‌వి రావాల్సి ఉండ‌గా కొన్ని ఈక్వేష‌న్లలో మిస్ అయ్యింద‌ని.. తాను పార్టీనే న‌మ్ముకుని ఉన్నాన‌ని.. త‌న విధేయ‌త ఏంటో చంద్రబాబుకు తెలుస‌ని… వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పెడ‌న నుంచే మ‌రోసారి అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని చెపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కాగిత వ‌ర్సెస్ కొన‌క‌ళ్ల మ‌ధ్య టికెట్ ఫైట్ జోరందుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్రబాబు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *