yanamalaRamakrishnudu

వామ్మో… యనమల ఫ్యామిలీనా?

పొలిటికల్

తెలుగుదేశం పార్టీలో ఓ సీనియర్‌ నేత ఫ్యామిలీ పొలిటికల్ కేరీర్‌ కష్టాల్లో పడిందా? ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఫ్యామిలీ విషయంలో వచ్చే ఎన్నికల్లో సీరియస్ డెసిషన్‌ తీసుకోనున్నారా? అంటే తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో అవుననే స‌మాధానం వస్తోంది. తుని నియోజకవర్గం పేరు చెబితే టీడీపీలో కాకలు తీరిన రాజకీయ యోధుడు, ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన యన‌మల రామకృష్ణుడే గుర్తుకొస్తారు. 1983 నుంచి 2004 వరకు ఇక్కడ ఆయన ఓటమి అనేది ఎరగకుండా ఆరుసార్లు వరుసగా గెలిచి డబుల్ హ్యాట్రిక్‌ సాధించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తుని నియోజకవర్గం యనమల ఫ్యామిలీ కోటగా మారింది. ఆరు సార్లు గెలిచిన యనమల 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో యనమల సోదరుడు యనమల కృష్ణుడు ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. ఆరుసార్లు గెలిచిన ఫ్యామిలీ రెండుసార్లు ఓడిపోవడం ఆశ్చర్యం కాకపోయినా ప్రస్తుతం నియోజకవర్గంలో మాత్రం యనమల ఫ్యామిలీ పేరు చెబితే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

నియోజకవర్గంలో సీనియర్‌ రాజకీయ నేతగా ఉన్న యనమలతో పాటు ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు చేస్తున్న వ్యవహారాలతో ఇక్కడ ఆ ఫ్యామిలీపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. మళ్ళీ ఇదే ఫ్యామిలీకి సీటు ఇస్తే తునిలో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదని టీడీపీ వాళ్లే ముక్తకంఠంతో చెబుతున్నారు. కొన్ని ప్రధాన సామాజికవర్గాల్లో యనమల ఫ్యామిలీ పేరు చెబితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 2009 నుంచి తునిలో యనమల ఫ్యామిలీ ప్రభావం తగ్గుతూ వస్తోంది.

గత ఎన్నికల్లో యనమల సోదరుడు యనమల కృష్ణుడు 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలకంటే భిన్నంగా యనమల సోదరుడు కృష్ణుడు ఓడిపోతే ఇక్కడ చక్రం తిప్పి ఆయన సోదరుడికే ఏఎంసీ ఛైర్మన్‌ పదవి ఇప్పించుకున్నారు. ప్రత్యేక్ష ఎన్నికల్లో ఓడిపోయిన యనమల ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకుని మంత్రి అయితే… గత ఎన్నికల్లో ఓడిన ఆయన సోదరుడికి ఏఎంసీ ఛైర్మన్‌ పదవి ఇప్పించడంతో పార్టీ కోసం కష్టపడ్డ మిగిలిన కేడర్‌ అంతా యనమల ఫ్యామిలీకి సీటు ఇస్తే చిత్తుచిత్తుగా ఓడించాలని డిసైడ్‌ అయ్యి ఉన్నారు.

పార్టీ కోసం దశాబ్దాలుగా ఎంతో మంది కష్టపడితే పదవులన్ని ఈ ఫ్యామిలీకేనా అన్న భావన టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తుని అసెంబ్లీ టీడీపీ సీటు ఎవరిదన్న చర్చ ప్రారంభమైంది. యనమలే ఇక్కడ పార్టీని సగం భ్రష్టు పట్టించారంటే.. ఆయన సోదరుడు కృష్ణుడు దెబ్బకు తునిలో టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయని ఇక్కడ పార్టీని డెవలప్‌ చెయ్యడం ఎంత కష్టమో పార్టీ అధిష్టానానికి సైతం తెలిసివచ్చిందని సమాచారం.

చంద్రబాబు సైతం తునిలో జరుగుతున్న పరిణామాలపై రెండు మూడు నివేదికలు తెప్పించుకుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి యనమల ఫ్యామిలీని పక్కన పెట్టేయాలని ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న చర్చలు కూడా టీడీపీలో జరుగుతున్నాయి. తునిలో గెలుపుపై తనకు సైతం సందేహం ఉండడంతో యనమల తన ఫ్యామిలీకి కాకినాడ రూరల్‌ సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది.

కాకినాడ రూర‌ల్ సీటు నుంచి టీడీపీ త‌ర‌పున య‌న‌మ‌ల కుమార్తె దివ్య పేరు వినిపిస్తోంది. అలాగే యనమల ఫ్యామిలీకే చెందిన మరో వ్యక్తి రాజానగరం అసెంబ్లీ సీటుపై కూడా కన్నేసినట్టు టాక్‌. ఏదేమైనా తునిలో మాత్రం యనమల ఫ్యామిలీ తీరుతో టీడీపీ పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక్కప్పటి టీడీపీ కంచుకోట కాస్త కరిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *