Tgbharath-svmohanreddy

ఎస్వీని డోంట్ కేర్ అంటున్న టీజీ భ‌ర‌త్.. ఎలాగంటే?

పొలిటికల్

క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డిని అదే పార్టీకి చెందిన యువ‌నేత టీజీ భ‌ర‌త్ డోంట్ కేర్ అంటున్నారు. టీజీ వెంక‌టేష్‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. ఈయన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లోనూ, ప్రస్తుతం చంద్రబాబు ద‌గ్గర రాజ‌కీయాలు చేస్తున్న టీజీ.. గ‌తంలో మంత్రిగా కూడా చేశారు. ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న టీజీ ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ వార‌సుడు రంగ ప్రవేశం చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీజీ త‌న‌యుడు.. టీజీ భ‌ర‌త్ రంగంలోకి దిగుతున్నారు. అయితే, టికెట్ విష‌యంలో ఇప్పటి వ‌రకు ఎలాంటి క్లారిటీలేక‌పోయినా.. త‌మ ఆర్థిక బ‌లమే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని న‌మ్ముతున్న తండ్రీ త‌న‌యులు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అన్ని సిద్ధం చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఆయ‌న విజ‌న్ యాత్ర పేరుతో ఎన్నిక‌ల యాత్ర ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం త‌న తండ్రి చైర్మన్‌గా ఉన్న టీజీవీ గ్రూప్ వ్యాపార సంస్థల‌కు భ‌ర‌త్ సీఎండీగా ఉన్నారు.

ఇక‌, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తుండ‌డంతో భ‌ర‌త్ త‌న రాజకీయ వ్యూహాన్ని ఆవిష్కరించారు. విజ‌న్ యాత్ర పేరుతో త‌న ఎన్నిక‌ల యాత్రకు ఆయ‌న రెడీ అవుతున్నారు. ప్రజలకు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో తాను విజన్‌ యాత్ర ప్రారంభిస్తున్నానని చెప్పారు. నవంబరు నుంచి కర్నూలు సిటీ నియోజకవర్గం పరిధిలోని 33 వార్డుల్లో యాత్ర ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ ద్వారానే ప్రజల అవసరాలను తెలుసుకుంటున్నారని, టీడీపీ తరపునే ఈయాత్ర ద్వారా ప్రజలను కలుస్తామని చెప్పారు.

నాయకుడు 24 గంటలు అందుబాటులో ఉంటామంటూ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. విజన్‌ యాత్ర పూర్తయ్యాక 2019 జనవరి నెలలో తన మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పారు. తన విజన్‌ యాత్ర టీడీపీ పక్షానే ఉంటుందని, పార్టీకి ఇది మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ యాత్ర ద్వారా ప్రజల అవసరాలేమిటో స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, టీజీబీ యూత్‌ సంస్థ ద్వారా కర్నూలులోనూ తాము సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నామని అన్నారు.

అయితే, ప్రస్తుతం క‌ర్నూలులోని అన్ని స్థానాల్లోనూ టీడీపీ నాయ‌కులు, సీనియ‌ర్లు పోటాపోటీగా ఉన్నారు. అయితే, ఆది నుంచి క‌ర్నూలు ఎమ్మెల్యే టికెట్‌పై టీజీ భ‌ర‌త్ దృష్టి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ టికెట్‌నే కోరుకుంటున్నారు. విజ‌న్ యాత్ర పేరుతో ఆయ‌న టార్గెట్ చేసింది కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్నే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇక్కడ ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డికి టీజీ ఫ్యామిలీకి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో భ‌ర‌త్ ప్రయ‌త్నాలు ఏ మేరకు ఫ‌లిస్తాయో చూడాలి.

ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మొత్తానికి క‌ర్నూలు ఎమ్మెల్యే టికెట్ విష‌యంలో రాజుకున్న వివాదానికి చంద్రబాబు ఎలా చెక్ పెడ‌తార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *