review-savyasachi

అప‌”స‌వ్యసాచి”

సినిమా

-జిఆర్ మ‌హ‌ర్షి
ద‌ర్శకుడు చందు మొండేటి, నాగ‌చైత‌న్య కాంబినేష‌న‌ల్లో గ‌తంలో “ప్రేమ” వ‌చ్చింది. రెండు సంవ‌త్సరాల గ్యాప్‌లో స‌వ్యసాచి వ‌చ్చింది. ఇంత టైం తీసుకున్నాడు కాబ‌ట్టి చందు మంచి క‌థ‌ను త‌యారు చేసుకుని ఉంటాడ‌ని అంద‌రూ ఆశించారు. చ‌క్కెర పొంగ‌లి అందిస్తాడ‌నుకుంటే స‌ద్ది వాస‌నొచ్చే ద‌ద్దోజ‌నం వ‌డ్డించాడు. త‌లాతోకాలేని ఈ క‌థ‌తో మాధ‌వ‌న్‌లాంటి మంచి న‌టుడు వృధా అయిపోయాడు. నాగ‌చైత‌న్య ఒక్ క్యూట్ ల‌వ్‌బాయ్‌. అత‌ని నెత్తిన యాక్షన్ అనే బండ‌రాయి మోపితే మోయ‌లేడు.

కానీ హీరోల‌కి యాక్షన్ సినిమాల పిచ్చి ప‌ట్టింది. యాక్షన్లో క్లిక్ అయితే మాస్ హీరోగా వంద‌కోట్ల క‌లెక్షన్‌లోకి చేరిపోవ‌చ్చని ఆశ‌. ఈ గోల‌లో హీరోలు త‌ప్పులు చేస్తారు. చందులాంటి డైరెక్టర్లు త‌మ‌ది కాని జాన‌ర్‌లో చేతులు పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. స‌వ్యసాచి అంటే రెండు చేతుల‌తో బాణాలు వేసేవాడు. ఇలా అర్జునుడిని పిలుస్తారు. ఈ పేరుని సినిమాతో క‌నెక్ట్ చేయ‌డానికి డైరెక్టర్ నానా తంటాలు పడి అప్పుడ‌ప్పుడు మ‌న‌ల్ని సాచికొడుతుంటారు.

సినిమా ప్రారంభ‌మే భ‌స్మాసురుడి క‌థ‌తో ప్రారంభ‌మ‌వుతుంది. ఇత‌రుల్ని నాశ‌నం చేయ‌డానికి ప్రయ‌త్నించేవాడు తానే నాశన‌మ‌వుతాడ‌నే నీతితో ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ఇంట్రోతో హీరోకి నెగిటీవ్ షేడ్స్ ఉన్నాయేమో అనే అనుమానం వ‌స్తుంది. త‌ర్వాత ఒక బ‌స్సులో సీన్ ఓపెన్ అవుతుంది. ఆ బ‌స్సులో ఉన్న 21 మందికి అరుణ్ అనే వ్యక్తి తెల్సు. వాళ్లు అరుణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్ చాలా ఇంటెలిజెంట్ అని అర్థమ‌వుతుంది. అయితే ఆ బ‌స్సు యాక్సిడెంట్‌కు గురై హీరో త‌ప్ప అంద‌రూ చ‌చ్చిపోతారు. హీరోనే విల‌న్ అనే అనుమాన‌మొచ్చి కొత్త క‌థ‌ను చూస్తున్నామ‌ని అనుకుంటాం.

ఆ త‌ర్వాత హీరోలో ట్విన్‌సిండ్రోమ్ అనే ల‌క్షణాలున్నాయ‌ని తెలుస్తుంది. ట్విన్స్‌గా రూపుదిద్దుకోవాల్సిన పిండం, ఒక్కరిగా పుడితే ఇద్దరి తెలివితేట‌లు ఒక్కరికే వ‌స్తాయ‌ని, ఒక్కరిలో ఇద్దరుంటార‌ని రావు ర‌మేష్ చెబుతాడు. హీరోలో ఒక విల‌న్ కూడా ఉన్నాడేమో, స్టోరీ వెరైటీగా ఉంద‌ని ప్రేక్షకుల్లో ఆస‌క్తి క‌లుగుతుంది.

లైన్ వ‌ర‌కు కొత్తగా ఆలోచించిన డైరెక్టర్‌, దాన్ని ఎగ్జిక్యూట్ చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఒక‌డిలో ఇద్దరు ఉండ‌డం వ‌ల్ల ఏ ప్రయోజ‌నం క‌న‌ప‌డ‌దు. ఫ‌స్ట్‌హాఫ్ అంతా హీరోయిన్ ల‌వ్‌స్టోరీతో బోరింగ్‌గా న‌డుస్తుంది. వెన్నెల కిషోర్, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ కొంత రిలీఫ్ ఇచ్చినా అది క‌థ న‌డ‌వ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌దు. రెండు చేతుల‌తో బాణాలు వేస్తాడ‌నుకుంటే అస‌లు హీరో ద‌గ్గర బాణాలే లేవ‌ని మ‌న‌కు అర్థమ‌వుతుంది.

ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ద‌గ్గర మాధ‌వ‌న్ వ‌స్తాడు. సెకెండాఫ్ అయినా సినిమాని గ‌ట్టెక్కిస్తుందేమో అని ఆశ‌ప‌డ‌తాం. ప‌ది నిమిషాల్లో ప‌ద్యవ్యూహం ప్రారంభం అని ఇంట‌ర్వెల్ లెట‌ర్స్ ప‌డితే అపుడు అర్థంకాదు. కానీ థియేట‌ర్‌లోకి వెళ్లిన త‌ర్వాత అర్థమ‌వుతుంది. ఆ ప‌ద్మవ్యూహం ప్రేక్షకుల మీద అని. బ‌య‌టికి రావ‌డం అనేది మ‌నం అభిమ‌న్యుడా, అర్జునుడా అనే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. సెకెండాఫ్‌లో ధ్రువ‌, స్పైడ‌ర్‌లాగా టామ్ అండ్ జెర్రీ షో స్టార్టవుతుంది.

ప‌ది నిమిషాల త‌ర్వాత డైరెక్టర్‌కి ఏంచేయాలో అర్థంకాక జ‌బ‌ర్దస్త్ ఆది, వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, సుద‌ర్శన్‌ల సాయంతో సుభ‌ద్రాక‌ళ్యాణం అనే నాటకం వేయిస్తాడు. బూతు జోకుల‌తో న‌వ్విస్తాడు. కానీ క‌థ‌కి అది స్పీడ్ బ్రేక‌ర్‌. హీరో సిస్టర్‌గా భూమిక న‌టించింది. ఎక్స్‌ప్రెష‌న్ లేకుండా త‌మ్మున్ని చూడ‌డం వ‌ల్ల ఆమె చేసిందేమీ లేదు. మాధ‌వ‌న్ విల‌న్‌గా బాగా యాక్ట్ చేశాడు కానీ అదంతా వృధాగా మారింది. హీరోయిన్ గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్‌.

ఈ వార‌స‌త్వ హీరోల‌తో ఉన్న స‌మ‌స్య ఏంటంటే, నాగ‌చైత‌న్యని క‌థ‌లో పాత్రధారిగా చూడాల‌నుకున్నా చూడ‌నివ్వరు. ఆయ‌న నాగార్జున కొడుకని గుర్తుచేస్తూ ఉంటారు. చైన్ అయినా, చున్నీ అయినా వీళ్ల చేతుల్లో అట్టే ఇమిడిపోతుంది అని డైలాగ్‌లు ప‌డుతుంటాయి. ఆ త‌ర్వాత “ల‌గాయితు” అని నాగార్జున పాట కూడా వ‌స్తుంది.

ప్రేక్షకులు మారుతున్నారు. మ‌న హీరోలు మాత్రం రౌడీల‌ను గాల్లోకి ఎగ‌రేసి తంతున్నారు. వాళ్లు కొడుతున్నది రౌడీల‌ను కాదు డ‌బ్బులు పెట్టి వ‌చ్చిన ప్రేక్షకుల్ని అని గ్రహించ‌క‌పోతే న‌ష్టపోయేది హీరోలు, డైరెక్టర్లే. జ‌నం త‌మ‌కు నచ్చిన వాటిని నెత్తిన పెట్టుకుంటారు. దానికి ఉదాహ‌ర‌ణ గీత‌గోవిందం, కేరాఫ్ కంచ‌ర‌పాలెం.

రేటింగ్ -2/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *