pavankalya

రాజ‌కీయానికి మించిన సినిమా ఉందా ప‌వ‌న్‌?

పొలిటికల్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే పిచ్చిగా ప్రేమించే అభిమానుల‌కు కొదువ లేదు. అన్న చాటు త‌మ్ముడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినీరంగ ప్రవేశం చేసిన‌ప్పటికీ, న‌ట‌న‌లోనూ, వ్యక్తిత్వంలోనూ, వ్యక్తిగ‌త జీవితంలోనూ త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను నిలుపుకున్నాడు. అందుకే ప‌వ‌న్‌కు అంత ఫాలోయింగ్‌.

స‌మాజానికి సేవ చేయాల‌నే ప‌వ‌న్ నిబ‌ద్ధత‌ను ఎవ‌రూ కాద‌న‌లేనిది. అయితే ఆయ‌న పంథాపైన్నే భిన్నాభిప్రాయాలు. ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేనానిగా ప‌వ‌న్ ప్రత్యామ్నాయ రాజ‌కీయ‌మంటూ మాట్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడంటూ ప్రచారం గుప్పుమంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ ప్రచారానికి ఆయ‌న ఫుల్‌స్టాప్ పెడుతూ ఓ ప్రక‌ట‌న చేశారు. సినిమాల్లో న‌టించ‌బోన‌ని, పూర్తి స‌మ‌యం ప్రజాజీవితానికే అంకిమ‌వుతాన‌ని ఆయ‌న స్పష్టంచేశారు. సినిమాల‌పై మ‌న‌సు పెట్టలేద‌ని, ప్రజ‌ల్లోనే ఉంటూ, అభిమానుల‌తో క‌ల‌సి పాల‌కుల త‌ప్పిదాల‌ను ఎత్తిచూప‌డ‌మే కాకుండా, వారిని ఓడించాల్సిన స‌మ‌యొం ఆస‌న్నమైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

స‌హ‌జంగానే ప‌వ‌న్‌ను అభిమానించే వారికి ఇది నిరాశ క‌లిగిస్తుంది. అయితే ఆయ‌న్ను బాగా అర్థం చేసుకుంటే మాత్రం సినిమాకు మించిన కిక్కు ఆయ‌న ఎప్పటిక‌ప్పుడు త‌న అభిమానుల‌కు, తెలుగు ప్రజానీకానికి ఇస్తూనే ఉన్నారు. సినిమా కేవ‌లం రెండు లేదా రెండున్నర గంట కాల‌క్షేపం మాత్రమే.

కాని ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ 24 గంట‌లూ షో చూపుతూనే ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ల్లో ప్రసంగిస్తున్నప్పుడు చేతులు తిప్పుతూ, త‌ల ఆడిస్తూ, ఒళ్లంతా మెలిక‌లు పోతూ… ప్రత్యర్థుల‌ను కాళ్లూచేతులూ విర‌గ్గొట్టి మూలన కూర్చోబెడుతాన‌న‌డం, ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ అంత‌టి వాడిని కాల‌ర్ ప‌ట్టుకుని కొడుతాన‌ని హెచ్చరిస్తూ రెచ్చగొడుతుంటే, ఆయ‌న అభిమానులు ఈలలు, కేక‌లు వేస్తూ సినిమా చూస్తున్న అనుభూతి పొందుతున్నారు.

స‌మాజ మార్పు కోసం ఎప్పుడో ఐదేళ్లక్రితం జ‌న‌సేన పార్టీని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రారంభించారు. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల‌ప్పుడు న‌రేంద్రమోడీ నిజాయితీకి మెచ్చి, చంద్రబాబు రాజ‌కీయ అనుభ‌వానికి ముగ్ధుడినై మ‌ద్దతు ప్రక‌టించాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌నే ప్రక‌టించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబును తానే అధికారంలోకి తెచ్చాన‌ని ప‌వ‌న్ చెప్పని రోజు లేదు.

దాదాపు నాలుగేళ్ల పాటు చంద్రబాబుకు వంత‌పాడిన ప‌వ‌న్ ఉన్నట్టుండి యూట‌ర్న్ తీసుకున్నారు. లోకేశ్‌పై విమ‌ర్శల బాణాన్ని ఎక్కు పెట్టారు. జ‌గ‌న్‌పై స‌రేస‌రి. ఎంత‌సేపూ త‌న‌ను వారు అలా అన్నారు, వీరు ఇలా విమ‌ర్శించారు, వారి తాట తీస్తా అని హెచ్చరిస్తూ, రెచ్చగొడుతూ ప‌వ‌న్ త‌న మార్క్ రాజ‌కీయాల‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఒక‌వైపు త‌న‌కు కులం లేదంటూనే ప‌దేప‌దే త‌న త‌ల్లిదండ్రులు, భార్య‌, పిల్లల కులాల గురించి ప్రస్తావించ‌డం వెనుక ప‌వ‌న్ ఆంత‌ర్యం ఏమిటో ఆయ‌నే చెప్పాలి. ఇప్పుడు త‌న‌కున్న అంత ఇంతో బ‌లం కులం కాక మ‌రేమిటో ఆయ‌న చెబితే బాగుంటుంది.

దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు కులం, మ‌తం, డ‌బ్బుతో క‌లుషిత‌మ‌య్యాయ‌నేది న‌గ్నస‌త్యం. కులానికి తాను అతీతుడ‌ని అంటూనే త‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న జిల్లాల్లోనే ఆయ‌న కొన్ని నెల‌లుగా ఎందుకు తిష్ట వేశారో ప‌వ‌న్ చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

సినిమాల్లో ఆయ‌న న‌ట‌న చూసి కులాలు, ప్రాంతాల‌కు అతీతంగా ల‌క్షలాది మంది అభిమానులుగా మారారు. ఇప్పుడు రాజ‌కీయాల్లో న‌ట‌న‌లో ఆయ‌న జీవించ‌డం చూసి అమ్మో ప‌వ‌నా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

కావున ఇక‌పై సినిమాల్లో న‌టించ‌ని ప‌వ‌న్ ప్రక‌ట‌న చేసి ఎవ‌రూ నిరాశ‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ఆయ‌న రాజ‌కీయ తెర‌పై చేస్తున్న న‌ట‌న ముందు సినిమా న‌ట‌న ఎందుకూ ప‌నికిరానిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *