chandrababu

బాబుకే పోటీ వ‌స్తే మోడీపై కోపం రాదా మ‌రి!

న్యూస్

మోడీపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? ఎందుకంత యాంగ్రీ? అవునండి ప‌ద‌వి కోసం అంగ్రీ ఉన్నప్పుడు యాంగ్రీనే కాదు… ర‌క‌ర‌కాల భావ‌న‌లు క‌ల‌గ‌డం స‌హ‌జం. ఆఫ్టరాల్ మోడీ… త‌న‌కంటే రాజ‌కీయాల్లో జూనియ‌ర్‌. ప్రధాని ప‌ద‌విపై కూర్చొని త‌న ముందు వంగి దండాలు పెట్టించుకుంటే…మ‌న‌సు ఎట్లా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అస‌లు అర్థం కానిది, అర్థం లేనిది ఏంటంటే … ఆ మోడీ వ్యవ‌స్థల‌న్నటిని ధ్వంసం చేయ‌డం.

ఏమిటిది నాన్సెస్‌. అర్రె వ్యవ‌స్థల‌న్నటిని విధ్వంసం చేసేందుకు త‌న‌కు మాత్రమే పేటెంట్ హ‌క్కులున్నాయ‌ని మోడీకి ఎంత చెప్పినా అర్థంకావ‌డం లేదు. అందుకే క‌దా ఈ ఎడ‌బాటు, అందుకే క‌దా మోడీ, బాబు మ‌ధ్య విర‌హ వేద‌న‌.

‘‘దేశంలోని కీలక వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తుంటే, ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంటే… ఒక మౌన సాక్షిగా మిగిలిపోవడం ఇష్టంలేకే పోరాటం ప్రారంభించాను. మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాను. ఆరు నెలల్లో ఎన్నికల సమరం మొదలు కాబోతోంది. ఇందులో న్యాయం, ధర్మమే గెలుస్తుంది. మోదీ సర్కారు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం! ఎన్నికల్లో గెలిచి ఈ దేశాన్ని కాపాడుకుంటాం’’ అని తెలుగుదేశం అధిపతి, చంద్రబాబు మంగళవారం నెల్లూరులో జరిగిన ‘ధర్మపోరాట దీక్ష’లో పేర్కొన్నారు.

ఈ మాట‌ల‌ను సిగ్గు విన‌కుండా చూడండి. ఈ మాట‌ల‌ను ప్రజాస్వామ్య చెవిన ప‌డ‌కుండా చూడండి. ఈ మాట‌ల‌ను త‌ట్టుకొలేక‌ కీల‌క వ్యవ‌స్థలు ఆత్మహ‌త్యకు పాల్పడ‌కుండా ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మాట‌లు విని ప్రజాస్వామ్య ప్రేమికులు కుప్పకూలి పోకుండా మ‌నో నిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపండి. బాబు మాట‌లు ఇంత మందిలో ప్రమాద ఘంటిక‌లు మోగిస్తున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం.

ఈ నాలుగున్నరేళ్ల పాల‌న‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో సంక్షేమం, సంతోషం గాలికి పోయి సంక్షోభం తిష్ట వేసుకొని కూర్చొంది. ప్రతిప‌క్ష వైసీపీ త‌ర‌పున గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల‌ను నిస్సిగ్గుగా, నిర్లజ్జగా టీడీపీలో చేర్చుకోవ‌డం ఏ ప్రజాస్వామిక ల‌క్షణం? ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రిప‌ద‌వులు క‌ట్టబెట్టడం ప్రజాస్వామ్య విలువ‌ల వ‌లువ‌లు విప్పడం కాదా? గ‌్రామాల్లో జ‌న్మభూమి క‌మిటీల‌ను ఏర్పాటు చేసి స‌ర్పంచుల మాట‌కు విలువ లేకుండా చేయ‌డం వ్యవ‌స్థల‌ను భ్రష్టు ప‌ట్టించ‌డం కాకుండా మ‌రేమ‌వుతుంది?

ప్రకృతిని స‌ర్వనాశ‌నం చేస్తూ ఇసుక‌, మ‌ట్టిని య‌థేచ్ఛగా వ్యాపార ప్రయోజ‌నాల‌కు కొల్లగొట్టడం ద్వారా రాష్ర్టాన్నివిధ్వంసం చేసిన‌ట్టు కాదా? అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బ‌నాయించ‌డం నియంతస్వామ్యానికి ప్రతీక కాదా? జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో దాడి జ‌రిగిన వెంట‌నే డ్రామా అంటూ స్వయానా ముఖ్యమంత్రే అంటే ద‌ర్యాప్తుపై నీలినీడ‌లు క‌మ్ముకోవా? ఇది వ్యవ‌స్థపై జోక్యమా? దాడా?

ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో సినిమా న‌టుడిని ముందుకు తెచ్చి రాష్ర్టాన్ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలో ముంచెత్తి, అభ‌ద్రతా భావంతో ఉన్న ప్రజ‌ల్లో సెంటిమెంట్‌ను ర‌గిల్చి మ‌రోసారి అధికారంలోకి రావాల‌నుకోవ‌డం కుట్ర కాదా?

ఓట్లు, అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు వంచ‌న‌లో త‌న‌కు మించిన నేత మోడీ త‌యార‌య్యాడ‌నే కోప‌మా? వ‌్యవ‌స్థల‌ను భ్రష్టు ప‌ట్టించే బాధ్యత‌, ప్రజాస్వామ్యాన్ని కూల‌దూసే అరుదైన అవ‌కాశం మోడీకి ల‌భించింద‌నే ఓర్వలేని త‌న‌మా? ఇంత‌కూ ఏది నిజ‌మో బాబు చెప్పాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *