venumadhav-comedy

వేణు మాధవ్ పోటీ కామెడీ కాదు క‌దా?

న్యూస్

హాస్యన‌టుడు వేణుమాధ‌వ్ పేరు విన్నా, మ‌నిషిని చూసినా వెంట‌నే న‌వ్వు రాక‌మాన‌దు. రాజ‌కీయాలకు వ‌చ్చేస‌రికి ఆయ‌న టీడీపీ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. ఇప్పుడాయ‌న తెలంగాణ ఎన్నిక‌ల పోరులో కోదాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి అంద‌రినీ ఈ న‌వ్వించ‌డానికి బ‌దులుగా ఆశ్చర్యప‌రిచారు. వేణుమాధ‌వ్ అంటే టీడీపీ నేత‌గా, అభిమానిగా గుర్తింపు పొంది.. ఇప్పుడు ఆ పార్టీ త‌ర‌పున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. టీడీపీ వ్యూహాత్మకంగా వేణును నిలిపిందా అనే అభిప్రాయం కూడా స‌ర్వత్రా వ్యక్తమ‌వుతోంది.

సుమారు 25 ఏళ్లుగా వేణుమాధవ్ కి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్‌ ఆశించినట్లుగా కూడా ఎక్కడా వినపడలేదు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణం. వేణుమాధవ్‌కు స్థానికంగా మిత్రబృందం, పరిచయాలు బాగానే ఉన్నాయి. దీంతో ఆయన బరిలో నిలిచారు. అయితే, ఒకవేళ ఎమ్మెల్యే కావాలనే ఆశ తనలో ఉంటే తాను సుదీర్ఘకాలం పనిచేసిన టీడీపీ టికెట్‌ అడిగేవారు కదా ? అలా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం వెనుక టీడీపీ వ్యూహమే ఉందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే కోదాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించింది. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన బొల్లం మల్లయ్య యాదవ్ 68 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల్లోనూ మల్లయ్య యాదవ్ టీడీపీ టికెట్‌ ఆశించారు. అయితే, మహాకూటమిలో భాగంగా ఈ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతికి దక్కింది. దీంతో మల్లయ్య యాదవ్ తీవ్ర అసంతృప్తితో టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరినా బలమైన నాయకుడైనందున మల్లయ్య యాదవ్ కి టీఆర్ఎస్ టికెట్‌ దక్కింది. అయితే, స్వయానా పీసీసీ అధ్యక్షుడి భార్య పోటీ చేస్తున్న ఈ స్థానం మహాకూటమికి కీలకమైనది. దీంతో ఇంతకాలం టీడీపీకి నియోజకవర్గంలో పెద్దదిక్కుగా ఉన్న మల్లయ్య యాదవ్ ఓట్లలో చీలిక తెచ్చేందుకే వేణుమాధవ్ తో పోటీ చేయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇంతకాలం టీడీపీతో ఉన్న వేణుమాధవ్ ఎక్కువగా మల్లయ్య యాదవ్ ఓట్లే చీల్చే అవకాశం ఉన్నందున టీడీపీ పెద్దలే వేణుమాధవ్ ను ఎన్నికల బరిలో దిగేలా చేశారని అంటున్నారు.

అయితే, వేణుమాధవ్ పోటీలో ఉంటారా? ఉన్నా ఆయన ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పలేం. అయితే, కోదాడలో పరిచయాలు ఉన్నప్పటికీ ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య పోటీలో వేణుమాధవ్ కేవలం నామమాత్రంగా మిగిలి.. రాజ‌కీయాల్లో కూడా కామెడీ యాక్టర్‌గా నిలుస్తారా అన్నది ఫ‌లితాలే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *