Swaroop-Chand-Gehlot-Manjulata-

ఇదేమీ హాబీ… రాజ‌స్థాన్‌లో భార్య, భర్తల పోటీ

న్యూస్

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ. ఇంత పెద్దదేశంలో ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఇక రాజ‌కీయాల విష‌యానికి వస్తే… కొంత మందికి అదో వ్య‌స‌నం. కొంద‌రు ప్రచార యావ‌తో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంటారు. మ‌రికొంద‌రు స‌మ‌స్యల‌ను చ‌ర్చకు పెట్టేందుకు కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుంటారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దంప‌తులు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగారు. ఇది ఆస‌క్తిక‌రంగా మారింది. కాక‌పోతే వారిద్దరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా త‌ల‌ప‌డుతున్నారు.

రాజ‌స్థాన్‌లోని బికనీర్‌ ఈస్ట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ జంట పోటీలో నిలిచారు. ఈ ఇద్దరు ఎందుకు పోటీ చేస్తున్నారో కారణం తెలిస్తే షాక్‌ అవుతారు. స్వరూప్‌ చంద్‌ గెహ్లాట్‌ (55), మంజులత గెహ్లాట్‌ (52) భార్యాభర్తలు. స్వరూప్‌ చంద్‌ 1988 నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తాజాగా మరోసారి బికనీర్‌ ఈస్ట్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో మంజులత కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో ఒకే సీటు కోసం భార్యాభర్తలు పోటీచేస్తున్నారని రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది. ఒకరం గెలిస్తే మరొకరం పరస్పరం సహకరించుకుంటామని చెప్పడం గమనార్హం.

స్వరూప్‌ చంద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడున్నర దశాబ్దాల కిందట మంజులతతో వివాహం జరిగింది. మాకు ముగ్గురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశాం. మేం సంతోషంగా ఉన్నాం. 30 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అయితే ప్రచారానికి నేను వెళ్లగా నా భార్య ఇంటిదగ్గర ఒంటరిగా ఉంటోంది. ఈ సారి అలా అవ్వకూడదని ఆమెతో నామినేషన్‌ వేయించా. ప్రచారానికి ఇద్దరం ఒకే స్కూటర్ మీద వెళ్లవచ్చునని’ వివరించారు.

‘నేను గెలిస్తే భర్త సహకారం తీసుకుంటా. నా భర్త గెలిస్తే ఆయన వెన్నంటే ఉంటా. ప్రచారానికి వెళ్లినా ఇద్దరం ఒకేసారి బయటకువెళ్తాం’ అని మంజులత చెప్పారు. డిసెంబర్‌ 7న జ‌రిగే ఎన్నిక‌లో వీరి భ‌విత‌వ్యం తేల‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *