కూకట్పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచారం చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. కొడాలి నానికి మొదటి నుంని నందమూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్కు కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
మరోవైపు హైదరాబాద్ పరిధిలో అత్యంత కీలకమైన స్థానాల్లో కూకట్పల్లి నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండడం వల్ల అన్నిపార్టీల దృష్టి దీనిపై పడింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఈ స్థానంపై తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం.
గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఇప్పుడు కూకట్పల్లి ఆ పార్టీకే దక్కింది. అందుకే ఈసారి కూడా ఇక్కడ పాగా వేయాలని టీడీపీ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఇక్కడి నుంచి దివంగత నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టికెట్ కేటాయించింది ఆ పార్టీ అధిష్ఠానం. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సుహాసిని కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టిన ఆమె.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నాని హరికృష్ణ కుటుంబం కోసం తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ను గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి నువ్వానేనా అన్నట్టు పోరుకి సిద్ధమయ్యాయి.
హరికృష్ణ కూతురి గెలుపు కోసం తనవంతుగా ప్రచారం చేయాలని నాని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే జగన్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తోంది.
అయినా కొడాలి నాని మాత్రం తాను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి కొడాలి నాని నిజంగా ప్రచారం చేయాలనుకుంటున్నారో లేదో తెలీదు కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయి.
నందమూరి అభిమానుల ఓట్ల కోసమే నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.