chandrababu-turumala

తిరుమ‌ల వెంక‌న్నకు చంద్రన్నశ‌ఠ‌గోపం

న్యూస్

ఎం.పురుషోత్తం రెడ్డి

-అమ‌రావ‌తిలో టిటిడి నిధుల‌తోనే ఆల‌య నిర్మాణం
ప్రపంచ ప్రసిద్ధి చెంది, రాయలసీమకే తలమానికమైన‌ తిరుమల తిరుపతి దేవస్థానంపై అమరావతి కేంద్రంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు టిటిడి పాలిట శాపంగా మారుతోంది. అమరావతిలో టిటిడి నమూనా ఆలయం నిర్మించాలని, అందుకోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయాలన్న బోర్డు తీర్మానంపై రాయలసీమ ప్రజలు, శ్రీవారి భక్తులు ఆగ్రహంతో ఉన్నారు.

పుండు మీద కారం కొట్టిన‌ట్టు అమరావతిలో ప్రైవేటు సంస్థలకు భూమిని అమ్మినట్టు టిటిడికి కూడా విక్రయించాని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 25 ఎకరాల్లో ఆలయనిర్మాణం చేస్తారు. టిటిడి ఎకరాకు రూ.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయాలి. వాస్తవానికి అక్కడ ఎకరా 23.10 లక్షలు రూపాయిలు మార్కెట్ రేటు ఉంది. అంటే టిటిడి రూ. 6 కోట్ల 72 లక్షల 50 వేలు అదనంగా వెచ్చించి భూమి కొనుగోలు చేయాలి. ఆ తర్వాత రూ.150 కోట్లు ఖర్చు చేసి ఆలయం నిర్మించాలి.

ప్రపంచంలో అనేక సంస్థలు, వ్యక్తులు టీటీడీకి ఉచితంగా నిధులు ఇస్తామని ముందుకు వస్తుంటే, వాటిని కాదని అమరావతిలో టిటిడినే స్వయంగా కొనుగోలు చేసి మరీ వందల కోట్లు ఖర్చుచేసి నిర్మాణాలు చేయమని ప్రభుత్వం టిటిడిపై వత్తిడి చేయడం దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ఉల్లంఘించడమే. ఇదే విజయవాడలో ఒక దాత 4 ఎకరాల భూమిని చాలాకాలం క్రితం టిటిడికి దానంగా ఇచ్చారు. దాని విలువ నేడు రూ.100 కోట్లు. అంతటి విలువైన సంపదను దుర్గగుడికి కేటాయింపు చేస్తూ జీవో నెంబర్ 445ను జారీచేసింది.

విచిత్రం ఏమిటంటే అదే దుర్గగుడికి చెందిన 50 ఎకరాల భూమిని బెంజి సర్కిల్ లో నామమాత్రం ధరకు దాదాపు 90 ఏళ్లకు ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు లీజుకు ఇచ్చారు. ఇపుడు దుర్గగుడి అవసరాలకు అని టిటిడి ఆస్తిని నిబంధనలకు భిన్నంగా కేటాయించారు. రూ.100 కోట్ల టిటిడి భూములను దుర్గగుడికి బదలాయించిన బాబు ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న అమరావతిలో కనీసం 200 ఎకరాలు ఉచితంగా ఇవ్వాలి.

కానీ అందుకు భిన్నంగా ఒకవైపు టిటిడి ఆస్తిని ఇతర అవసరాలకు బదలాయింపు చేస్తూ మరోవైపు అమరావతిలో నమూనా ఆలయం నిర్మాణం చేయాలని వత్తిడి చేయడం, అందుకు అవసర‌మైన భూమిని టిటిడినే అధిక ధరకు కొనమనడం దారుణం. ఒక్కమాటలో చెప్పాలంటే అమరావతి కేంద్రంగా ఉన్న రాయలసీమ దేవాలయాల సంపదకు ఎప్పటికయినా ప్రమాదం ఉందని ఈ పరిణామాలను బ‌ట్టి అర్థం చేసుకోవచ్చు.

అందుకే టిటిడి నిధులు కేవలం సంస్థ అవసరాలు, భక్తులకు మెరుగైన వసతుల కల్పన కోసం మాత్రమే ఖర్చుచేయాలి. మిగిలిన నిధులను తిరుపతి, రాయలసీమ అభివృద్ధికి వెచ్చించాలి. అలాంటి చట్టం అమలుకు రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా తిరుపతి ప్రజలు రాజకీయలకతీతంగా పోరాడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *