అయ్యన్న వర్సెస్ సన్యాసి పాత్రులు

న్యూస్ పొలిటికల్

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, టిడిపి పట్టణ అధ్యక్షులుగా ఉన్న మంత్రి అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడుకి, మంత్రి తనయుడు చింతకాయల విజరుకు మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో వారి మధ్య కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మంత్రి అయ్యన్న ఆధ్వర్యాన నిర్వహించిన స్కేటింగ్‌ పోటీల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పట్టణ ప్రథమ పౌరులైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు (జమీలు) కనిపించకపోవడం, ఫ్లెక్సీల్లో కూడా వారి పేర్లు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల కాలంలో అయ్యన్న నిర్వహించే కార్యక్రమాల్లో జమీలు, ఈయన నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనడం లేదు. ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎడముఖం, పెడముఖం అన్నట్లు ఉంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్‌ ప్రకారం మున్సిపాలిటీ ప్రథమ పౌరురాలైన మున్సిపల్‌ చైర్‌్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడిని ఆహ్వానించాల్సి ఉంది. ముఖ్యమైన ప్రయివేటు కార్యక్రమాలకు కూడా వారిని పిలవడం సంప్రదాయం. అయితే మంత్రి అయ్యన్నపాత్రుడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు కుటుంబాల మధ్య నెలకొన్న రాజకీయ ఆదిపత్య పోరు నేపథ్యంలో ఈ సంప్రదాయాన్ని పాటించలేదు.
మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యాన నర్సీపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల వేటిల్లోనూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు కనిపించలేదు. పట్టణ ప్రథమ పౌరులైన వారిని ఆహ్వానించలేదా? ఆహ్వానించినా వారు వెళ్లలేదా? అన్న అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నప్పటికీ చైర్‌పర్సన్‌ దంపతులు వెళ్లలేదని ప్రచారం ఉంది. అయితే నిజంగా ఆహ్వానించి ఉంటే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఫొటోలు, పేర్లు ఎందుకు లేవన్న వాదన కూడా ఉంది. 23న మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జలహారతి కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దంపతులు హాజరు కాలేదు. దీనికి ఆహ్వానం లేదని సమాచారం. మరో వైపు మున్సిపాలిటీలో సన్యాసిపాత్రుడు నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్న కనిపించడం లేదు. ఇలా మంత్రి చేపట్టే కార్యక్రమాలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు, వారి చేపట్టే కార్యక్రమాలకు మంత్రి వెళ్లడం లేదు. సన్యాసిపాత్రుడు, విజరు మధ్య నెలకొన్న రాజకీయ వివాదాన్ని మంత్రి అయ్యన్న అంతగా పట్టించుకోలేదు. పైగా తనయుడు విజరు వైపే కొమ్ముకాస్తున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానానికి సన్యాసిపాత్రుడు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేసిన విషయం విధితమే.అయ్యన్న, సన్యాసిపాత్రుడు పుట్టిన రోజులు ఒకే రోజు కావడంతో ప్రతి ఏటా వారి జన్మదిన వేడుకలు కలిసి నిర్వహించుకునేవారు. ఈ వివాదాల నేపథ్యంలోనే ఈ ఏడాది ఎవరికి వారు వేర్వేరుగా పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్నారు. నాగుల చవితి పండుగ కూడా వేర్వేరుగా చేసుకున్నారు. ఇటీవల ఆదరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో సన్యాసిపాత్రుడు పాల్గొనప్పటికీ సోదరులిద్దరూ ఎడముఖం పెడముఖంగానే కనిపించారు. కొత్తవీధిలో సిసి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలోనూ అదే పరిస్థితి. ఏ అధికారం లేకపోయినా మంత్రి తనయుడు విజరు ఈ నెల 23న మెగా లైసెన్సు మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు.మంత్రి సోదరుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మాజీ ఎమ్మెల్యే వేచలపు శ్రీరామ్మూర్తి ఇటీవల వారితో సమావేశమైనట్లు తెలిసింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఎటువంటి సమోధ్య కుదరలేదు. దీంతో వారిని కలపడానికి వచ్చిన కొందరు పెద్దలు కూడా అక్కడ నుంచి వెనుదిరిగినట్లు భోగట్టా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *