telangana

సెటిల‌ర్లు ఎటువైపు?

గాసిప్స్ న్యూస్

తెలంగాణ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర‌చుకున్న సెటిల‌ర్ల మ‌నోగ‌తం అంతుప‌ట్టడం లేదు. హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపే స్థానాల్లో ఏ పార్టీ వైపు మొగ్గు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ధనికులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. అయితే, జూబ్లీహిల్స్ పేరుతో ఏర్పడిన నియోజకవర్గంలో మాత్రం బస్తీలు, పేద, మధ్య తరగతి ఓటర్లే ఎక్కువగా జీవిస్తున్నారు.

జూబ్లీహిల్స్ లోని ధనికప్రాంతం మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. ఇక బస్తీలు, సాధారణ కాలనీలు ఎక్కువగా ఉండే షేక్ పేట, రహ్మత్ నగర్, బోరబండ, వెంగళరావునగర్ ప్రాంతాలు మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మైనారిటీలు, సెటిలర్లు ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది.గత ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు, బీజేపీతో పొత్తు కారణంగా మాగంటి గోపీనాధ్ టీడీపీ అభ్యర్థిగా 9 వేల మెజారిటీతో విజయం సాధించారు.

రెండోస్థానంలో ఎంఐఎం నిలిచింది. దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి మూడో స్థానానికే పరిమితం అయ్యారు. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో నాలుగు టీఆర్ఎస్ గెలుపొందగా మూడు డివిజన్లలో ఎంఐఎం విజయం సాధించింది. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన మాగంటి గోపీనాధ్ కే ఈసారి టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన రెండు నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక, టీఆర్ఎస్ తో స్నేహం కారణంగా ఎంఐఎం ఈసారి పోటీ పెట్టలేదు. సెటిలర్ల ప్రభావం ఉన్న స్థానం కావడంతో ప్రజాకూటమిలో టీడీపీ ఈ స్థానాన్ని కోరింది. చివరకు కాంగ్రెస్ తీసుకుని పీవీఆర్‌ను నిలబెట్టింది. నియోజకవర్గంలో మైనారిటీలు సుమారు ఒక‌ లక్షమంది ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. దీంతో వీరి ఓట్లే కీలకంగా మారనున్నాయి. పోయినసారి ఎంఐఎం తరపున హిందూ అభ్యర్థిని నిలబెట్టింది. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ పోటీచేసి 41 వేల ఓట్లు సాధించారు.

నియోజకవర్గంలో ఎంఐఎంకి ఆయనే ఇంతకాలంగా నాయకత్వం వహిస్తున్నారు. ముస్లిం వర్గాల్లో, యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఎంఐఎం శ్రేణులు ఎక్కువ శాతం టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వకుండా నవీన్ యాదవ్‌కే మద్దతు పలుకుతున్నారు. ఇక ముస్లింలలో టీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉండటం, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి ఈ వర్గం ఓటర్లలో గుర్తింపు ఉండటంతో అసలు ముస్లిం ఓటర్లు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముగ్గురు అభ్యర్థులు ముస్లిం ఓట్లను చీల్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.సుమారు 30 వేలు ఉన్న సెటిలర్ ఓట్లు గత ఎన్నికల్లో టీడీపీ కి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోలయ్యాయి. టీడీపీతో పొత్తు కారణంగా ఈ ఎన్నికల్లో సెటిలర్ ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఆయన ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పోయి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు కూడా అర్పించారు. అయితే, టీడీపీ క్యాడర్ పూర్తిస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం లేదు.

ఈ ఎన్నికల్లో ముస్లిం, సెటిలర్లు ఏకపక్షంగా ఎవరివైపూ ఉండే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కి గెలుపు అవకాశాలు సమానంగా కనిపిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉన్నా గెలిచే స్థాయిలో ఓట్లు సాధిస్తారని మాత్రం చెప్పలేం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *