pavankalya

సీమ బ‌రిలో పోటీ నుంచి నిష్క్రమిస్తున్న జ‌న‌సేన‌?

గాసిప్స్ న్యూస్

-సొదుం ర‌మ‌ణారెడ్డి

వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ బ‌రి నుంచి జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నట్టు విశ్వస‌నీయ స‌మాచారం. ఈ వార్తా క‌థ‌నం రాయ‌ల‌సీమలోని జ‌న‌సేన కార్యకర్తలు, శ్రేణులు, మెగా అభిమానుల‌కు తీవ్ర ఆవేద‌న క‌లిగించేదే అయిన‌ప్పటికీ… చేదు నిజాన్ని జీర్ణించుకోక త‌ప్పద‌ని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయ‌క‌త్వం చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రజాపోరాట యాత్ర పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ కొన్ని నెల‌లుగా జ‌నం మ‌ధ్యే ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ యాత్ర మొట్ట మొద‌ట ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించారు.

ప్రజ‌ల‌కు ఆయ‌న‌కు బ్రహ్మర‌థం ప‌డుతున్నార‌నే విష‌యాన్ని ఆయ‌న స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌న‌సందోహ‌మే చెబుతోంది. ఉత్తరాంధ్ర త‌ర్వాత ఆయ‌న కోస్తాలోకి ప్రవేశించారు. గ‌త కొన్ని నెల‌లుగా కేవ‌లం ఆయ‌న తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కే ప‌రిమితం కావ‌డం జ‌న‌సేన శ్రేణుల‌కు కూడా కాస్త అనుమానం క‌లిగిస్తోంది. స‌మాజ మార్పు, ప్రశ్నించే గొంతుక కోసం తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెబుతుంటారు. ఆయ‌న మాట‌ల‌కు స్ఫూర్తి పొందిన క‌ర్నూలుకు చెందిన ఓ యువ‌జంట జ‌న‌సేన‌లో చేరింది. ఉన్నత విద్యావంతులైన ఆ జంట కులాంత‌ర వివాహం చేసుకున్నారు.

స‌మాజ మార్పు కోసం ద‌ప్పిక‌గొన్న కోట్లాది ప్రజ‌ల్లో వారు కూడా ఉన్నారు. అంతోఇంతో ఆర్థిక‌స్తోమ‌త ఉన్న ఆ జంట‌లో ఒక‌రు జ‌న‌సేన త‌ర‌పున క‌ర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌ని ఉత్సాహం చూపుతున్నారు. చ‌ల్లకొచ్చి ముంత దాచ‌డం ఎందుక‌నే ఉద్దేశంతో జ‌న‌సేన‌లో త‌మ‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న ద్వితీయశ్రేణి నాయ‌కుడిని ఇటీవ‌ల వారు హైద‌రాబాద్‌లో క‌లిసి త‌మ మ‌న‌సులో మాట‌ను వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం. ఎంతో ఉత్సాహం, స‌మాజాన్ని మార్చాల‌న్న దృఢ‌సంక‌ల్పం వారి మాట‌ల్లో, చేత‌ల్లో చూసిన ఆ నాయ‌కుడికి ఎంతో ముచ్చటేసింద‌ట‌.

స‌మాజంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి పోక‌డ‌లు, త‌మ‌కెందుక‌నే మ‌ధ్యత‌ర‌గ‌తి అల‌స‌త్వం, కెరీర్‌కు త‌ప్ప మ‌రేదేనికీ ప్రాధాన్యం ఇవ్వని యువ‌కుల నిష్క్రియాప‌ర‌త్వం గురించి ఆ యువ‌జంట ఎంతో ఆవేద‌న‌, ఆర్తితో మాట్లాడిన‌దంత విన్న త‌ర్వాత ఆ పెద్దాయ‌న మాట్లాడ‌టం మొద‌లు పెట్టాడ‌ట‌. “అమ్మా మీలో నా బిడ్డల‌ను చూసుకుంటున్నాను. మీకు ఎంతో ఉజ్వ‌ల‌భ‌విష్యత్ ఉంది. జ‌న‌సేన‌ను న‌మ్ముకుంటే స‌మాజాన్ని మార్చ‌డం సంగ‌తి ప‌క్కన పెడితే , మ‌నుషులపైన్నే అస‌హ్యం క‌లుగుతుంది. మీలాగే నేను కూడా బ‌య‌ట నుంచి చూసి ఏదో అనుకుని పార్టీలో చేరాను.

ఇప్పుడు ఎందుకు చేరానురా బాబు అని ప్రతిరోజు మ‌ధ‌న‌ప‌డుతున్నాను. ఇటీవ‌ల ప‌వ‌న్ విమ‌ర్శల‌ను ఒక్కసారి గ‌మ‌నించండి. ఆ మాట‌ల వెనుక ఉన్న మ‌ర్మాన్ని విశ్లేషించండి. క‌ర్నూలే కాదు రాయ‌ల‌సీమ‌లో ఎక్కడా జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని నేను అనుకోవ‌డం లేదు. ఎందుకంటే రాయ‌ల‌సీమ‌లో కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉంది. జ‌న‌సేన పోటీ చేస్తే ఓట్ల‌లో చీలిక వ‌చ్చి జ‌గ‌న్ ల‌బ్ధి పొందుతాడ‌నే ఉద్దేశంతో ప‌వ‌న్ పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇది పార్టీ ఇన్నర్ స‌ర్కిల్‌లో ప్రస్తుతం జ‌రుగుతున్న చర్చ” అని ఆ పెద్దాయ‌న ఆ యేఉవ‌జంట‌కు హితోప‌దేశం చేశాడ‌ట‌.

ఏక‌కాలంలో ఆశ్చర్యం, ఆందోళ‌న‌కు గురైన ఆ యువ‌జంట నోట మాట రాక నోరెళ్ల బెట్టార‌ట‌. అంటే టీడీపీపై విమ‌ర్శలు, మూడో ప్రత్యామ్నాయ కూట‌మి…ఎట్సెట్రా గురించి ప‌వ‌న్ మాట‌లు… అని ఏదో అడ‌గ‌బోయార‌ట‌. అమ్మా మాట్లాడుకోడానికి అన్నీ బాగానే ఉంటాయి. గ‌త మార్చిలో ప్రత్యేకహోదా కోసం ఆమ‌ర‌ణ‌దీక్ష చేస్తాన‌ని ప‌వ‌న్ ల‌క్షలాది మంది మ‌ధ్య మాట ఇచ్చారు. ఆ త‌ర్వాత ఎప్పుడైనా ఆయ‌న ఆ ఊసు ఎత్తారా? ఆయ‌న మాట‌ల హీరోనే త‌ప్ప చేత‌ల మ‌నిషి కాద‌ని ఆ పెద్దాయ‌న కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు చెప్పాడ‌ట‌.

అంతేకాదు జ‌న‌సేన‌ను న‌మ్ముకుని మీ వృత్తుల‌ను గాలికి వ‌దిలేసి వ‌చ్చి, బంగారు లాంటి జీవితాల‌ను బ‌లి చేసుకోవ‌ద్దని అర్జునుడికి శ్రీ‌కృష్ణుడు గీతోప‌దేశం చేసిన‌ట్టు ఆ పెద్దాయ‌న చేశాడ‌ట‌. ఆ పెద్దాయ‌న హిత‌బోధ విన్న త‌ర్వాత గ‌త కొన్ని నెలలుగా ప‌వ‌న్ విమ‌ర్శలు, హామీలు వారి క‌ళ్ల ముందు క‌ద‌లాడాయి. ఎంత‌సేపూ అధికార ప‌క్షానికి ప్రయోజ‌నం క‌లిగించే విమ‌ర్శ‌లే త‌ప్ప‌… ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయ‌డం లేద‌ని వారిక‌ర్థమైంది. అందులోనూ రాయ‌ల‌సీమ‌లో క‌నీసం ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికైనా అభ్యర్థిని ప్రక‌టించక‌పోవ‌డం వారి అనుమానాల‌కు బ‌లం చేకూర్చింది.

కులాల ఐక్యత గురించి ప‌దేప‌దే మాట్లాడే ప‌వ‌న్… త‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లోనే తిష్టవేయ‌డం… ప‌వ‌న్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేద‌ని వారికి అర్థమైంది. జ్ఞానోద‌యం అయిన వారి మాదిరిగా త‌ల‌పై ఏదో భారాన్ని దించుకున్నట్టుగా ఆ పెద్దాయ‌న నుంచి సెల‌వు తీసుకుని తిరిగి క‌ర్నూలుకు ఆ యువ‌జంట బ‌య‌ల్దేరింద‌ట‌. అవును ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది. పోటీ చేసేందుకు ఓ లెక్క‌, పోటీచేయ‌కుండా ఉండేందుకు ఓ లెక్క‌. రాయ‌ల‌సీమ బ‌రి నుంచి త‌ప్పుకునేందుకు ఆ లెక్కాప‌క్కల గురించి కాల‌మే జ‌వాబు చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *