chandrababu

న‌వ్విపోదురుగాక‌…నాకేటి సిగ్గు!

న్యూస్

-సొదుం ర‌మ‌ణారెడ్డి

తెలంగాణ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా అక్కడి అధికార టీఆర్ ఎస్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమ‌ర్శలు వింటుంటే.. హ్హ‌..హ్హ‌..హ్హ‌…అని న‌వ్వుకోని వారు ఉండ‌రు. న‌వ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందంగా ఆయ‌న వైఖ‌రి ఉంటోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పార్టీ ఫిరాయింపు, హామీల అమ‌లుపై చంద్రబాబు తీవ్ర ఆరోఫ‌ణ‌లు, ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రసంగం ఎట్లా సాగుతున్న‌దంటే…మాట్లాడేవారి కంటే… వినేవారే సిగ్గుప‌డాల‌న్నట్టుగా ఉంది.

“ఏం త‌మ్ముళ్లు మ‌న పార్టీ త‌ర‌పున గెలిచి అధికార పార్టీలోకి సిగ్గులేకుండా ఫిరాయించారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే చిత్తుచిత్తుగా ఓడించండి” అని చంద్రబాబు పిలుపిచ్చారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రజ‌లెవ‌రూ కోరుకోరు. నాయ‌కులు త‌మ స్వార్థ ప్రయోజ‌నాల కోసం, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫిరాయించ‌డాన్ని రెండు తెలుగురాష్ర్టాల్లో ఇద్దరు చంద్రులు బాగా ప్రోత్సహించారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తాను చేసిన ఫిరాయింపుల ప్రోత్సాహం గురించి సౌక‌ర్యవంతంగా మ‌రిచిన చంద్రబాబు, హైద‌రాబాద్‌లో మాత్రం కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం, ఫిరాయింపుదారుల‌ను ఓడించాల‌ని పిలువునివ్వడం చూసిన వారికి, విన్న వారికి సిగ్గనిపించింది.

అలాగే ముస్లింల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు, కేసీఆర్ కేబినెట్‌లో కనీసం ఒక్క మ‌హిళ‌కైనా అవ‌కాశం ఇవ్వక‌పోవ‌డాన్ని చంద్రబాబు త‌ప్పుప‌ట్టారు. ఇదే చంద్రబాబు ఏపీలో కాపుల‌కు క‌ల్పిస్తామ‌న్న రిజ‌ర్వేష‌న్ ఎందుకు అట‌కెక్కిందో మ‌రిచిపోయిన‌ట్టున్నారు. అలాగే బాబు త‌న కేబినెట్‌లో ఎందుకు ఒక్క మైనార్టీకైనా నాలుగున్నరేళ్ల పాటు మంత్రిప‌ద‌వి ఇవ్వలేదో స‌మాధానాన్ని ప్రజ‌ల‌కు కాక‌పోయినా, క‌నీసం త‌న అంత‌రాత్మకైనా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

బాబు వ‌స్తే జాబొస్తుంద‌నే నినాదంతో 2014లో అధికారాన్ని కైవ‌సం చేసుకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో త‌న బాబుకు మంత్రి ఉద్యోగాన్ని మిన‌హాయిస్తే.. ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చిన దాఖ‌లాలున్నాయా? ప‌్రత్యర్థుల‌పై విమ‌ర్శలు చేసేముందు, మిగిలిన నాలుగు వేళ్లు త‌న‌వైపు చూపిస్తున్నాయ‌నే క‌నీస స్పృహ కూడా లేకుండా రాజ‌కీయ ప్రసంగాలు చేయ‌డం బాబుకే చెల్లింది.

“ఏ ముఖం పెట్టుకుని రాహుల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నారు? చ‌చ్చారో, బ‌తికారో చూడ్డానికి ఆయ‌న వ‌స్తున్నారా? ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ను ప్ర‌జ‌ల‌కు బ‌హిష్క‌రించాలి? కాంగ్రెస్‌ను ఏం చేసినా క‌సి తీర‌దు” అని ఒక‌ప్పుడు ఇంతెత్తున రాహుల్‌పై ఎగిరిన పే..ద్ద మ‌నిషి చంద్ర‌బాబు…నేడు అదు రాహుల్‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. రాజ‌కీయ అవ‌కాశ‌వాదంతో కాంగ్రెస్‌తో చేతులు క‌ల‌ప‌డ‌మే కాకుండా, దానికి దేశోద్ధార‌ణ అని నామ‌క‌ర‌ణం చేయ‌డం తెలుగుదేశం అధినేత‌కే చెల్లింది.

ఒక‌వైపు ఆంధ్రప్రదేశ్‌లో స‌వాల‌క్ష స‌మ‌స్యలను గాలికి వ‌దిలేసి, తెలంగాణ‌లో ప‌ట్టుమ‌ని 13 సీట్ల‌లో పోటీ చేస్తూ, రోజుల త‌ర‌బ‌డి అక్కడే తిష్టవేయ‌డం ఎందుకోస‌మో చంద్రబాబు స‌మాధానం చెప్పాలి. ఒక‌ప్పుడు మోడీని జైల్లో పెట్టాల‌ని డిమాండ్ చేసిన చంద్రబాబు… తిరిగి త‌న అవ‌స‌రాల కోసం అదే వ్యక్తితో చేతులు క‌లిపారు.

సోనియాను ఇటలీ రాక్షసి, అవినీతి అన‌కొండ అని తెగ‌నాడిన నోటితోనే నేడు దేవ‌త‌గా కొన‌యాడ‌డం బాబుకే చెల్లింది. క‌ల‌సి ప‌నిచేస్తామ‌నే త‌న ప్రతిపాద‌న‌కు కేసీఆర్ తిర‌స్కరించ‌డం వ‌ల్లే నేడు కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని చంద్రబాబు అంటున్నారు. అంటే కేసీఆర్ ఓకే అంటే ఆయ‌న స‌ర‌స‌న యుగ‌ళ గీతాలు పాడేవార‌న్నమాట‌.

ఎప్పటికప్పుడు అవ‌స‌రాలు, అవ‌కాశాలకు అనుగుణంగా ,విలువ‌ల‌తో సంబంధం లేకుండా తార‌స‌ప‌డే వారిని… అర్రె మీరు చంద్రబాబులాగా ఉన్నారే అని పిలుచుకునే రోల్‌మోడ‌ల్‌గా త‌యార‌య్యారు. అయ్యా 40ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం చివ‌రికి  మిమ్మల్ను ఈ విధంగా ఆవిష్కరించిందా? ఇది మీకేలా అనిపిస్తుందో గానీ… మాకైతే త‌ల దించుకునేలా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *