kcr-chandrababu-ysjagan

సీఆర్ గెలుపు – జ‌గ‌న్‌కు ఊపు -టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం

న్యూస్

-సొదుం ర‌మ‌ణారెడ్డి
తెలంగాణ‌లో అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఎన్నిక‌ల్లో రెండో ద‌ఫా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖ‌ర్‌రావు అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌డం, ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చ‌తికిల ప‌డ‌టం… ఏపీ ప్రతిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది. మ‌రో ఐదారు నెల‌ల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాతీర్పున‌కు వెళ్లనున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప్రజాకూట‌మి ఓట‌మిపాలు కావ‌డం ఆంధ్రా ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్రభావం చూప‌నుంది. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు తెలంగాణ‌లో వేసిన ఎత్తుగ‌డ‌ల‌ను కేసీఆర్ చిత్తు చేయ‌డం జ‌గ‌న్‌కు ఊహించ‌ని విధంగా క‌ల‌సి వ‌చ్చిందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే రాజ‌కీయ‌మ‌న్న త‌ర్వాత ఎత్తులుపైఎత్తులు స‌హ‌జం. తెలంగాణ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే చంద్రబాబు చొర‌వ‌తో ప్రజాకూట‌మి ఆవిర్భవించింది. నిజానికి చంద్రబాబు కోరిక మ‌న్నించి ఉంటే టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు ఉండేది. త‌నతో పొత్తు కాద‌నడంతో చంద్రబాబు అహం దెబ్బతిన్నట్టుంది. దీంతో ఎలాగైనా కేసీఆర్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌నే ప‌ట్టుద‌ల‌తో చంద్రబాబు టీడీపీకి బ‌ద్ద శ‌త్రువైన కాంగ్రెస్‌తో చేయి క‌లిపాడు. కేవ‌లం 13 స్థానాలు ఇచ్చినా చంద్రబాబు ఏ మాత్రం డిమాండ్‌కు దిగ‌క‌పోవ‌డం ఆశ్చర్యక‌రం.

రాహుల్‌తో క‌ల‌సి చంద్రబాబు బ‌హిరంగ స‌భ‌లు, రోడ్‌షోల‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పాల‌న‌పై తీవ్రస్థాయిలో బాబు విరుచుకుప‌డ్డారు. హైద‌రాబాద్‌ను తానే నిర్మించాన‌ని ప‌దేప‌దే చెప్పిన చంద్రబాబు, కేసీఆర్ విమ‌ర్శల‌తో కాస్త వెన‌క్కి త‌గ్గి… తాను సైద‌రాబాద్‌ను మాత్రమే క‌ట్టాన‌ని చెప్పుకోవాల్సి వ‌చ్చింది. రాజ‌కీయ వ్యూహాలు ప‌న్నడంలో కేసీఆర్ దిట్ట‌. తెలంగాణ ఎన్నిక‌ల ప్రచారానికి చంద్రబాబు రావ‌డాన్ని సువ‌ర్ణావ‌కాశంగా కేసీఆర్ వినియోగించుకున్నాడు.

తెలుగుజాతి పేరుతో మ‌రోసారి తెలంగాణ‌ను విధ్వంసం చేయ‌డానికి చంద్రబాబు బొడ్డులో క‌త్తి పెట్టుకుని వ‌చ్చాడ‌ని, ప్రజాకూట‌మి అధికారంలోకి వ‌స్తే సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోతాయ‌ని, అమ‌రావ‌తి పెత్తనం కింద బానిస బ‌తుకు బ‌త‌కాల్సి వ‌స్తుంద‌ని తెలంగాణ స‌మాజానికి కేసీఆర్ నూరిపోశారు. నిజానికి ప్రజాకూట‌మి ఆవిర్భావంతో కేసీఆర్‌కు ప్రత్యామ్యాయాన్ని చూప‌డం వ‌రకు విజ‌య‌వంతం అయ్యారు. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే పేరుతో ప్రజాకూట‌మి వైపే ప్రజానాడి ఉంద‌ని ఎన్నిక‌ల ముందు తన ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు విజ‌య‌వంతంగా ప్రచారం చేయ‌గ‌లిగారు.

అంతేకాకుండా కూక‌ట్‌ప‌ల్లిలో నంద‌మూరి వార‌సురాలిని నిల‌ప‌డం, సెటిల‌ర్స్ ఎక్కువ‌గా ఉండే శేర్‌లింగంప‌ల్లిలో టీడీపీ అభ్యర్థుల‌ను నిలిపి మ‌రోసారి హైద‌రాబాద్‌లో త‌న ప‌ట్టు నిరూపించుకోవాల‌ని చంద్రబాబు వ్యూహం వేశారు. అయితే బాబు అనుకున్నదొకటి.. అయ్యిందొక‌టి అనే చందంగా తెలంగాణ ప్రజ‌లు ఏక‌ప‌క్షంగా కేసీఆర్ వైపు తీర్పుచెప్పారు. అంతేకాకుండా నంద‌మూరి సుహాసినిని, శేర్‌లింగంప‌ల్లిలో టీడీపీ అభ్యర్థిని ఓడించ‌డంతో పాటు కేవ‌లం ఖ‌మ్మం జిల్లాలో రెండుచోట్ల విజ‌యం రుచి చూపిన తెలంగాణ ప్రజ‌లు, ఇక చంద్రబాబు అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని తెలంగాణ స‌మాజం చెప్పక‌నే చెప్పింది.

చంద్రబాబు అనుకున్నట్టుగా ప్రజాకూట‌మి విజేత‌గా నిలిచి ఉంటే ఆయ‌న ప‌ర‌ప‌తి అమాంతం పెరిగి ఉండేది. తెలంగాణ స‌మాజ‌మే త‌న నాయ‌క‌త్వాన్ని కోరుకుంటోంద‌ని, ఇక ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేద‌ని త‌న అనుకుల మీడియా ద్వారా ఆయ‌న ఊద‌ర‌గొట్టేవారు. ప్రజాకూట‌మి విజ‌యం ఖ‌చ్చితంగా ఆంధ్రాలో చంద్రబాబు విజ‌యాన్నిన‌ల్లేరుపై న‌డ‌క‌గా మార్చేవ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే చంద్రబాబు అంచ‌నాలు త‌ల‌కిందులై కేసీఆర్‌ను మ‌రోసారి విజ‌యం వ‌రించ‌డంతో జ‌గ‌న్‌కు అనూహ్యంగా ఆంధ్రాలో పాజిటివ్ సంకేతాలు పెరిగాయి.

మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్‌లో సెటిల‌ర్స్ ఎక్కువ‌గా ఉండే కూక‌ట్‌ప‌ల్లి, శేర్‌లింగంప‌ల్లి, కుత్పుల్లాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలుపొంద‌డంలో వైసీపీ, జ‌న‌సేన కీల‌క‌పాత్ర పోషించాయి. ఈ ప్రాంతాల్లో నివ‌సిస్తు సెటిల‌ర్స్ మెజార్టీ ఓట‌ర్లు కేవ‌లం చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఓటు వేశార‌న్నది వాస్తవం. అందువ‌ల్లే ఈ ఫ‌లితాలు చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల‌కు తీవ్ర నిరాశ‌, నిస్పృహ‌ల‌ను క‌లిగిస్తున్నాయి. ఈ ఫ‌లితాల ప్రభావంతో ఆంధ్రాలో గ్రామీణ‌, ప‌ట్టణ ప్రాంతాల్లో మ‌రీ ముఖ్యంగా జ‌గ‌నే సీఎం అని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారంటే అతిశ‌యోక్తి కాదు.

టీడీపీ శ్రేణులు కూడా త‌మ నాయ‌కుడి ప‌ట్ల ప్రజ‌ల్లో వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని బాహాటంగానే చెబుతున్నారు. తెలంగాణ‌లో మాదిరిగానే ఆంధ్రాలో కూడా జ‌గ‌న్ వైపు ఏక‌ప‌క్షంగా ఓట‌ర్లు మ‌ద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వైసీపీ శ్రేణులు చెబుతూ సంబ‌రాలు చేసుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా ల‌గ‌డ‌పాటి స‌ర్వే అట్టర్ ప్లాప్ కావ‌డం రానున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఎంతో క‌ల‌సివ‌చ్చే అంశం. ఎందుకంటే ల‌గ‌డ‌పాటిని అడ్డం పెట్టుకొని ఇలాంటి స‌ర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా ప‌దేప‌దే చేయించి జ‌నాల మైండ్‌సెట్‌ను మార్చే కుట్రల‌ను చేసేవారు.

ఇలా అన్ని అంశాలు జ‌గ‌న్‌కు సానుకూలంగా తెలంగాణ స‌మాజం ఇచ్చింది. వైసీపీ కార్యక‌ర్తలు, నాయ‌కులు ఇక్కడో విష‌యాన్ని గుర్తించుకోవాలి. మ‌నుషులు ఎక్కడైనా ఒక్కటే. భావోద్వేగాలు ప్రాంతీల‌కు అతీతంగా ఉంటాయి. ఇందులో మ‌రోమాట‌కు తావులేదు. కేసీఆర్ ఆంధ్రాలో కూడా ప్రచారం చేస్తాన‌ని ప్రక‌టించారు. ఏ విధంగానైతే కేసీఆర్ ఎన్నిక‌ల ప్రచారంలో చంద్రబాబును బూచిగా చూపి తిరిగి అధికారాన్ని ద‌క్కించుకున్నాడో, అదే అవ‌కాశాన్ని చంద్రబాబుకు ఇవ్వకుండా ఉంటే మంచిద‌నే విష‌యాన్ని, వాస్తవాన్ని గ్రహిస్తే జ‌గ‌న్‌కే మంచిది.

కేసీఆర్ విజ‌య‌మే జ‌గ‌న్‌కు అమూల్యమైన అనుకూల ప్రచారాన్ని తీసుకొచ్చింది. దాన్నిమ‌రింత‌గా జ‌నంలోకి తీసుకెళ్లడ‌మే వైసీపీ ముందున్న ప్రధాన క‌ర్తవ్యం. దాన్ని ప‌క‌డ్బందీగా నిర్వర్తిస్తే స‌రిపోతుంది. అంతేత‌ప్ప త‌మ‌కు మ‌ద్దతుగా కేసీఆర్ లేదా ఇత‌ర తెలంగాణ నేత‌ల‌ను తెచ్చుకుంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *