ttd

వైసీపీలో కొర‌వ‌డిన పోరాట‌త‌త్వం

న్యూస్ పొలిటికల్

-సొదుం ర‌మ‌ణారెడ్డి
-టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తెస్తుంద‌నుకుంటున్న వైనం
-ప్రజాస‌మ‌స్యల‌పై మొక్కుబ‌డి పోరాటాల‌కే ప‌రిమిత‌మైన ప్రధాన ప్రతిప‌క్షం

ఆరునూరైనా ఈ ద‌ఫా అధికారంలోకి రావాల్సిందేన‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రధాన ప్రతిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడాది క్రితం ప్రజాసంక‌ల్పయాత్ర మొద‌లుపెట్టాడు. సుదీర్ఘకాలం పాటు ప్రజ‌ల మ‌ధ్య ఉంటూ, వారి స‌మ‌స్యల‌ను తెలుసుకుంటూ త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తే న‌వ‌ర‌త్నాల పేరుతో అమ‌లుచేసే సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తూ ఆయ‌న ముందుకు సాగుతున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్రకు కోస్తా జిల్లాల్లో అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ ప‌రిణామాలు ముఖ్యంగా అధికార టీడీపీకి నిద్రలేని రాత్రుల‌ను మిగుల్చుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. జ‌గ‌న్ పాద‌యాత్ర కార‌ణంగా ప్రజ‌ల్లో వ‌స్తున్న సానుకూల మార్పును సొమ్ము చేసుకోవ‌డంలో వైసీపీ ద్వితీయ నాయ‌క‌త్వం విఫ‌ల‌మైతోంద‌న్న విమ‌ర్శలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

తాము ఏమీ చేయ‌క‌పోయినా జ‌గ‌న్ పాద‌యాత్రే గెలుపిస్తుంద‌న్న అత్యుత్సాహం వారిలో క‌నిపిస్తోంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. స్థానిక స‌మ‌స్యల‌పై వైసీపీ ద్వితీయశ్రేణి నాయక‌త్వం ఏమాత్రం పోరాటం చేయ‌క‌పోవ‌డంతో ప్రతిప‌క్ష వైసీపీపై త‌ట‌స్థ ఓట‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల బ్రహ్మోత్సవాలు అక్టోబ‌ర్‌లో ముగిశాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంట‌నే ఒక్కో ఉద్యోగికి రూ.12 వేలు చొప్పున టీటీడీ బోన‌స్ ఇవ్వడం కొన్నేళ్లగా సంప్రదాయంగా వ‌స్తోంది.

కానీ ఈ ఏడాది ఇంతవ‌ర‌కూ ఆ ఊసే ఎత్తక‌పోవ‌డంతో అధికార పార్టీపై టీటీడీ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. పైపెచ్చు అస‌లు బోన‌స్ ఎందుకు ఇవ్వాల‌ని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకార్‌యాద‌వ్ ప్రశ్నించిన‌ట్టు విస్తృతంగా ప్రచారం జ‌రుగుతోంది. ఇది టీటీడీ ఉద్యోగుల పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టైంది. మ‌రో ఐదునెల‌ల్లో సార్వత్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్రతి ఓటూ కీల‌క‌మే. అలాంటిది తిరుప‌తిలో గెలుపోట‌ముల‌ను శాసించే టీటీడీ ఉద్యోగుల గురించి ప్రతిప‌క్ష వైసీపీ ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.

ఒక‌ప్పుడు టీటీడీలో ఉద్యోగుల హోదాను బ‌ట్టి బోన‌స్ ఇచ్చేవారు. వైసీపీనేత క‌రుణాక‌ర్‌రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన త‌ర్వాత అంద‌రూ స‌మాన‌మేనంటూ… హోదాల‌తో సంబంధం లేకుండా బోన‌స్‌ను ఒకేలా ఇవ్వడం టీటీడీలో ఆయ‌న‌పై సానుకూల ధోర‌ణి వ్యక్తమైంది. దాన్ని ఇప్పుడు సొమ్ము చేసుకోవ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌వుతున్నారో అర్థంకావ‌డం లేద‌ని వైసీపీ కిందిస్థాయి నాయ‌కులు, కార్యక‌ర్తలు వాపోతున్నారు. అలాగే దివంగత వైఎస్సార్ హ‌యాంలో జిల్లాకు తీసుకొచ్చిన మ‌న్నవ‌రం ప్రాజెక్టును త‌ర‌లిస్తార‌నే ప్రచారం ఎప్పటి నుంచో జ‌రుగుతోంది.

దానిపై నిర్మాణాత్మకంగా పోరాటం చేయ‌డంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరుతో పార్టీ పేరు పెట్టుకున్న నేత‌లు విస్మరించ‌డం దౌర్భాగ్యం. అలాగే తిరుప‌తిలో ప్రతిష్టాత్మక స్విమ్స్ ఆస్పత్రిలో జ‌న‌ర‌ల్ స‌ర్జరీ ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో లైట్లు లేని కార‌ణంగా స‌ర్జరీలు నిలిపివేయ‌డం, రుయాలో పున‌రుద్ధర‌ణ ప‌నుల కార‌ణంగా మొత్తానికి మొత్తం ఆప‌రేష‌న్ థియేట‌ర్ మూసేసి ఆప‌రేష‌న్లకు స్వస్తి చెప్పడం రోగుల్లో తీవ్ర అస‌హ‌నానికి, ఆగ్రహానికి గురిచేసింది.

కాని రోగుల బాధ‌లు, వారి ఆందోళ‌న‌లు ప్రతిప‌క్ష వైసీపీ మ‌న‌సును ఏ మాత్రం క‌దిలించ‌డంలేదు. క‌నీసం రోగుల‌తో మాట్లాడం లేదా వారి స‌మ‌స్యల‌పై సంబంధిత అధికారుల‌కు విన‌తిప‌త్రం ఇచ్చే దిక్కు కూడా లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు అప్రజాస్వామిక పాల‌న‌పై జ‌నంలో తీవ్ర వ్యతిరేక‌త ఉండ‌టం వాస్తవ‌మే. కేవ‌లం చంద్రబాబుపై వ్యతిరేక‌తే త‌మ‌ను గెలుపిస్తుంద‌ని ప్రతిప‌క్ష వైసీపీ నేత‌లు క‌ల‌లు కంటున్నట్టు వారి వ్యవ‌హార శైలి తెలియ‌జేస్తోంది.

కాని రాజ‌కీయాల్లో ఈ ధోర‌ణి ఎప్పటికీ మంచిదికాదు. కేవ‌లం జ‌గ‌న్ పాద‌యాత్ర త‌మ‌కు అన్నీ తెచ్చి పెడుతుంద‌నుకుంటే అంత‌కంటే మూర్ఖత్వం మ‌రొక‌టి ఉండ‌దు. టీడీపీని వ‌ద్దనుకుంటున్న జ‌నానికి ప్రత్యామ్నాయంగా వైసీపీ క‌నిపించాలి. తాము ఓట్లు వేసీ అధికారాన్ని క‌ట్టబెడితే మంచి చేస్తార‌నే న‌మ్మకాన్ని, భ‌రోసాను ప్రతిప‌క్ష వైసీపీ నేత‌లు క‌లిగించాలి. క్షేత్రస్థాయిలో ప్రజ‌ల్లో ఆ న‌మ్మకాన్ని క‌లిగించేలా వైసీపీ ప‌నితీరు ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కోవ‌ర్గం ఒక్కో స‌మ‌స్యతో విల‌విల‌లాడుతోంది. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశ‌నిస్పృహ‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నారు. డీఎస్సీ నిరుద్యోగులు తిరుప‌తిలో ఏకంగా సీఎం చంద్రబాబు స‌భ‌లోనే నిర‌స‌న వ్యక్తంచేసి రానున్న ఎన్నిక‌ల్లో త‌మ వైఖ‌రేంటో స్పష్టంచేశారు. అలాగే గుంటూరులో ముస్లిం మైనార్టీల స‌భ‌లో త‌మ స‌మ‌స్యల‌పై సీఎం స‌భ‌లో ముస్లింలు నిర‌స‌న గ‌ళాన్ని వినిపించారు. రెండుమూడు రోజులక్రితం మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికులు సీఎం స‌భ‌లో ప్రభుత్వ అప్రజాస్వామికంగా పిల్లల‌కు వంట వండే కాంట్రాక్ట్‌ను త‌మ‌ను కాద‌ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించ‌డాన్ని నిర‌సించారు.

త‌మ‌కిచ్చిన హామీని ఎందుకు నెర‌వేర్చలేద‌ని న‌డిరోడ్డుపై సీఎంను నాయీబ్రాహ్మణులు నిల‌దీయ‌డం, వారి తోక‌లు క‌త్తిరిస్తాన‌ని సీఎం ఆగ్రహం వ్యక్తంచేయ‌డం మ‌నంద‌రం టీవీల్లో చూశాం. త‌మ త‌మ స‌మ‌స్యల‌పై బాధితులే నేరుగా సీఎంగా నిలదీస్తున్న ప‌రిస్థితుల్లో వారితో చేయిచేయి క‌లిపి ఉద్యమించాల్సిన ప్రతిప‌క్షం ఆ ప‌ని చేస్తున్న దాఖ‌లాలు ఎక్కడా క‌నిపించ‌డంలేదు. ఎంత‌సేపూ తాము అనుకున్నది మొక్కుబ‌డిగా చేస్తున్నట్టు క‌నిపిస్తోందే త‌ప్ప‌…. ప్రజల కేంధ్రంగా, వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్రతిప‌క్ష వైసీపీ పోరాటాలు చేస్తున్నట్టు మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా వైసీపీ త‌నధోర‌ణి మార్చుకొని ప్రజాక్షేత్రంలో దూకి యుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైంది. మేము ఇలాగే ఉంటాం, ఇలా చేస్తాం అని అంటే ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. ఎందుకంటే మ‌రోసారి ప్రతిప‌క్షానికే ప‌రిమితమ‌వుతామని ఆ పార్టీ నాయ‌కులు తీర్మానించుకొంటే ఎవ‌రికి న‌ష్టం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *