chandrababunaidu

బాబు వ్యూహాలు మ‌రోసారి గ‌ట్టెక్కిస్తాయా?

న్యూస్

-సొదుం ర‌మ‌ణారెడ్డి

-నాడు మోడీ, నేడు రాహుల్ నామ‌స్మర‌ణ‌
-త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను మ‌రుగుప‌రిచే య‌త్నం
సార్వత్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. దీంతో ఏపీలో రాజ‌కీయం వేడెక్కింది. పాల‌క‌, ప్రతిప‌క్ష పార్టీ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శలు, ప్రతివిమ‌ర్శలు నిప్పులు కురిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావార‌ణం ఎన్నిక‌ల తంతు ముగిసే వ‌ర‌కు అంటే మ‌రో నాలుగు నెల‌ల పాటు కొన‌సాగుతుంది. అధికారాన్ని నిలుపుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిప‌క్ష పార్టీల‌పై ఎక్కుపెట్టిన అస్త్రాల గురించి చ‌ర్చిద్దాం.

ఎన్నిక‌ల‌న్న త‌ర్వాత ఏదో ఒక ప్రధాన అస్త్రాన్నిఆయా పార్టీలు ప్రత్యర్థి పార్టీల‌పై గురిపెట్టడం స‌హ‌జం. చంద్రబాబు విష‌యానికి వ‌స్తే… ఇప్పుడాయ‌న త‌న‌ను గ‌ట్టెక్కించే ప్రధాన అస్త్రం మోడీ అస్త్రంగా భావించాలి. రాష్ర్టానికి ప్రధాని మోడీ తీవ్ర అన్యాయం చేశార‌ని, అలాంటి నేత‌తో ప్రతిప‌క్ష వైసీపీ నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంట‌కాగుతున్నార‌ని, ఇంతద్రోహం చేసినా కేసుల భ‌యంతో మోడీని ఆయ‌న ప‌ల్లెత్తుమాట కూడా అన‌లేద‌నే విమ‌ర్శల‌ను ప్రజ‌ల ముందుకు తెచ్చారు.

ఇక్కడో విష‌యాన్ని ప్రస్తావించాలి. ఏపీలో మూడో ప్రత్యామ్నాయం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఊరూరూ తిరుగుతున్నారు. వారంక్రితం వ‌ర‌కు మోడీకి ద‌త్తపుత్రుడని ప‌వ‌న్‌ను కూడా చంద్రబాబు స‌హా టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తూ వ‌చ్చారు. అయితే వ్యూహాత్మకంగా ప‌వ‌న్‌పై విమ‌ర్శల‌ను చేయ‌క‌పోవ‌డ‌మే గాకుండా జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే జ‌గ‌న్‌కు నొప్పేంటి? అని విలేక‌రుల‌ను చంద్రబాబు ఎదురు ప్రశ్నించ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. అయితే తామెవ‌రితో పొత్తు పెట్టుకునేది లేద‌ని ట్విట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ స్పష్టంచేశారు.

రాష్ర్ట విభ‌జ‌నానంత‌రం 2014లో జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ రెండు తెలుగు రాష్ర్టాల్లో పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న‌కు ప్రధాన కార‌ణ‌మైన కాంగ్రెస్‌పై ఏపీలో తీవ్ర వ్యతిరేక‌త ఉండింది. దీన్ని ప‌సిగ‌ట్టిన చంద్రబాబు నాడు పిల్లకాంగ్రెస్ అంటూ వైసీపీపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. సోనియాను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు. అంతేకాదు జ‌గ‌న్ ప్రసంగం సోనియా స్క్రిప్ట్ అంటూ ప్రజ‌ల్లో ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీపై వ్యతిరేక‌త పెంచి త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధిపొందాల‌ని ఎత్తుగ‌డ వేశారు. కార‌ణాలేవైన‌ప్పటికి 2014లో బాబు వ్యూహాలు ఫ‌లించి అధికారాన్ని క‌ట్టబెట్టాయి.

ఇప్పుడు 2019 ఎన్నిక‌లను ఎదుర్కోవాల్సిన స‌మ‌యం. తిరిగి అధికారాన్ని క‌ట్టబెట్టే ప్రచార అస్ర్తాలు బాబుకు కావాలి. నిన్నమొన్నటి వ‌ర‌కు కేవ‌లం మోడీతో జ‌గ‌న్ అక్రమ సంబంధాల గురించి విమ‌ర్శలు చేసిన బాబుకు ఇప్పుడు మ‌రో అస్ర్తం దొరికింది. అదీ తెలంగాణ ఎన్నిక‌ల్లో తాను వేలు, కాలు పెట్టడంతో ఎదురైన చేదు అనుభ‌వం నుంచి దొరికించుకున్నదే. ప్రత్యేకహోదాకు వ్యతిరేక‌మైన కేసీఆర్ గెలిస్తే వైసీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటోంద‌ని, తెలంగాణ‌లో ఆ పార్టీ టీఆర్ఎస్‌కు మ‌ద్దతు ప‌ల‌క‌డం వ‌ల్లే భారీ మెజార్టీ వ‌చ్చింద‌నే ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా టీడీపీ సెంటిమెంట్‌ను ర‌గిల్చడానికి య‌త్నిస్తోంది.

ఎందుకంటే తెలంగాణ‌లో ప్రజాకూట‌మి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పొత్తు పెట్టుకోవ‌డం, తానే వ్యూహాక‌ర్త అయిన‌ట్టు చంద్రబాబు ప్రచారం చేయ‌డం, కేసీఆర్‌కు అనూహ్యంగా ప్రచార అస్ర్తాన్ని అందించిన‌ట్టైంది. బాబు మ‌రోసారి బొడ్డులో క‌త్తి పెట్టుకుని వ‌స్తున్నాడ‌ని, ప్రజాకూట‌మికి అధికార‌మిస్తే అమ‌రావ‌తికి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని, మ‌న సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోతాయ‌నే అనుమానాల‌ను కేసీఆర్ జ‌నాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఆంధ్రాకు ప్రతినిధిగా చంద్రబాబును చూసిన తెలంగాణ జ‌నం , ఆయ‌న ప్రమేయాన్నిఓర్చుకోలేక తిరిగి కేసీఆర్‌కే ప‌ట్టంక‌ట్టారు.

అధికారాన్ని రెండోసారి ద‌క్కించుకున్న కేసీఆర్‌… చంద్రబాబుకు రిట‌ర్న్ గిప్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించి రాజ‌కీయ వేడిని పెంచారు. ఆ గిప్ట్ ఎలా ఉంటుంద‌నే విష‌య‌మై ఆంధ్రాలో చ‌ర్చోప‌చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే… చంద్రబాబు మాత్రం ప్రజాస్వామ్యంలో ఎవ‌రైనా ఎక్కడైనా పోటీ చేయ‌వ‌చ్చని, ప్రచారం చేయ‌వ‌చ్చని, ఆంధ్రాలో వైసీపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోవ‌చ్చని ఆహ్వానిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌తో ప్రధాన ప్రతిప‌క్షం పొత్తు పెట్టుకోవాలంటూ బాబు ప‌దేప‌దే డిమాండ్ చేయ‌డం ఒకింత ఆశ్చర్యం క‌లిగిస్తోంది.

దీన్నిబ‌ట్టి చంద్రబాబు త‌న‌ను వాటిపై జ‌నాల్లో వ్యతిరేక‌త మాత్రమే గ‌ట్టెక్కిస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టంలో బీజేపీ-టీడీపీ అధికారాన్ని పంచుకున్నాయి. ప్రత్యేకహోదాకు బ‌దులు ప్రత్యేక ప్యాకేజీ అని కేంద్రం ఇస్తామంటే… అదే మ‌హాభాగ్యమ‌ని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదిక‌గా ఆహ్వానించారు. అంత‌టితో ఆయ‌న ఆగారా… అంటే లేనేలేదు. ప్రత్యేక హోదా వ‌ల్ల బాగుప‌డ్డ రాష్ట్రాలేవో ప్రతిప‌క్ష చెప్పాల‌ని స‌వాల్ విసిరారు.

ప్రత్యేక ప్యాకేజీ ప్రక‌టించిన కేంద్రానికి కృత‌జ్ఞత‌లంటూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపారు. ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం ప్రత్యేకహోదాపై బాబు అనుస‌రిస్తున్న విధానాల‌ను అసెంబ్లీతో పాటు ఇత‌ర వేదిక‌ల‌పై నుంచి తిప్పికొట్టారు. కేంద్ర‌, రాష్ర్ట మోస‌పూరిత విధానాల‌పై ఊరూరూ చైత‌న్య స‌ద‌స్సులు, ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టి హీరోగా నిలిచారు. అంతేకాదు కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమ‌య్యారు. ప్రత్యేకహోదా ఇవ్వని మోడీ స‌ర్కార్‌తో పాటు తాను కూడా దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తోంద‌ని గ్రహించిన చంద్రబాబు వెంట‌నే ప్లేట్ ఫిరాయించారు.

ప్రత్యేకహోదా ఇవ్వని కార‌ణంగా కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామంటూ,,, స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు స‌రికొత్త డ్రామాకు బాబు తెర‌లేపారు. అప్పటి నుంచి ధ‌ర్మదీక్షలు, న‌వ‌నిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వ సొమ్మును ఖ‌ర్చుపెడుతూ మోడీపై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డం ప్రారంభించారు. ప‌నిలో ప‌నిగా త‌న వ్యతిరేకులైన ప్రతిప‌క్ష నేత‌లు జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లు మోడీ చెప్పిన‌ట్టు త‌న‌పై కుట్రలు చేస్తున్నార‌ని ప్రచారం ప్రారంభించారు. చివ‌ర‌కు హైకోర్టు విభ‌జ‌న కూడా కేంద్రం కుట్ర అని, జ‌గ‌న్ కేసుల‌ను నీరుగార్చేందుకే ఇలా చేశార‌ని బాబు విమ‌ర్శల‌కు దిగ‌డం సొంత పార్టీ నేత‌లను సైతం విస్మయానికి గురిచేసింది.

ముగ్గురు మోడీలు ఆంధ్రా ప్రజ‌లు దాడి చేస్తున్నారంటూ ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రా ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌ల‌ను ఒకేగాట‌న క‌ట్టేయ‌డం చంద్రబాబుకే చెల్లింది. తద్వారా త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను మ‌రుగున‌ప‌ర‌చి తిరిగి అధికారం ద‌క్కించుకోవాల‌నే వ్యూహం క‌నిపిస్తోంది. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో టీడీపీ 600 హామీల‌ను ఇచ్చింది. ఇందులో ప్రధానంగా రైతుల‌కు భేష‌ర‌తుగా రుణాల మాఫీ, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు లేదా రూ.2వేల భృతి, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్‌… త‌దిత‌ర అంశాలున్నాయి.

రైతుల‌కు ఇంకా రెండు కంతుల మాఫీ సొమ్ము పెండింగ్‌లో ఉంది. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు లేవు. నెల నుంచి అదీ నెల‌కు వెయ్యి చొప్పున మొక్కుబ‌డిగా నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అట‌కెక్కింది. దీంతో కాపులు మోస‌పోయామ‌నే ఆవేద‌న‌లో ఉన్నారు. అంతేకాకుండా మెజార్టీ కాపు ప్రజ‌లు ప‌వ‌న్ వెంట న‌డిచేందుకు సిద్ధంగా ఉన్నారు. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల నాడు బాబుకు అధికారం ద‌క్కేందుకు క‌లిసి వ‌చ్చిన అంశాలు… ఇప్పుడు ఏ ఒక్కటీ క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డంలేదు.

దీంతో తాము అధికారంలోకి రాగానే ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇస్తామ‌ని, రూ.2ల‌క్షల రుణ‌మాఫీ చేస్తామ‌ని జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి రాహుల్‌గాంధీ ప్రక‌టించ‌డం, దేశ‌స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అనే పేరుతో చంద్రబాబు క‌ల‌వ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి. గ‌తంలో ఏ ముఖం పెట్టుకొని రాహుల్‌గాంధీ ఆంధ్రాకు వ‌స్తున్నాడ‌ని ప్రశ్నించిన చంద్రబాబు… అదే నోటితో మోడీని కూడా ప్రశ్నించ‌డం వింత‌గా, విడ్డూరంగా ఉంది.

కాంగ్రెస్‌తో క‌ల‌సి ఏపీలో ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డేందుకు సిద్ధమైన బాబు…గ‌తంలో సోనియాను బూచిగా చూపిన‌ట్టే , ఇప్పుడు ఆమె స్థానంలో మోడీని నిలుపుతున్నారు. అయితే ప్రజ‌ల జ్ఞాప‌క‌శ‌క్తి, చైత‌న్యంపై బాబుకు చుల‌క‌న భావం ఉన్నట్టుంది. ఎందుకంటే క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని కేసీఆర్‌కు ఆప‌న్నహ‌స్తం అందించానని, మోడీ మాట‌లు విని త‌న‌ను తిర‌స్కరించార‌న్న బాబునే… త‌న విష‌యాన్ని మ‌ర‌చి జ‌గ‌న్‌ను దోషిగా చూపాల‌నుకోవ‌డం విచిత్రంగా ఉంది.

అలాగే బీజేపీతో క‌ల‌సి అధికారాన్ని పంచుకున్నన్ని రోజులు ప్రత్యేకహోదా కోసం ప‌నిచేసిన వారిపై కేసులు పెట్టడంతో పాటు ఇంత‌కంటే ఏ రాష్ర్టానికైనా కేంద్రం సాయం చేసిందేమో చూపాల‌ని స‌వాల్ విస‌ర‌డం… ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల మ‌న‌సుల్లో స‌జీవంగా జ్ఞాప‌కం ఉన్నాయి. కేవ‌లం మోడీ-కేసీఆర్‌తో జ‌గ‌న్ లేదా ప‌వ‌న్ స్నేహం చేస్తున్నాడ‌ని, వారు ఆంధ్రప్రదేశ్‌కు శ‌త్రువుల‌నే సెంటిమెంట్‌ను ఎగ‌దోసి ల‌బ్ధిపొందాల‌నుకునే బాబు వ్యూహాస్త్రాల‌ను ప్రజ‌లు ప‌సిగ‌ట్టలేర‌నుకోవ‌డం అజ్ఞాన‌మే అవుతుంది. పైపెచ్చు ఎన్నిక‌ల ముంగిట ప‌ది శ్వేత‌ప‌త్రాల‌ను విడుద‌ల చేసి స్వయం స్తుతి-ప‌ర‌నింద‌ల‌కు పాల్పడ‌టం 40 ఏళ్ల అనుభ‌వ‌జ్ఞుడు చేయాల్సిన ప‌నికాదు.

రాజ‌కీయ నేత‌ల త‌ల‌రాత‌లు రాసేందుకు ప్రజ‌లు తెల్లటి పేప‌ర్లను సిద్ధం చేసుకున్నారు. తిన‌బోతు రుచి చూడొద్దని పెద్దలు ఊరికే అన‌లేదు. ఇప్పుడు ప్రజ‌లే న్యాయ‌నిర్ణేత‌లు, బ్రహ్మస్వరూపులు. ప్రజ‌లే ఓటు అనే అస్త్ర‌, శ‌స్త్రధారులు. ఈ విష‌యాన్ని మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు గ్రహిస్తే మంచిది. అయిన‌దానికి, కానిదానికి కేంద్రం కుట్ర‌, మోడీ మోసం, కేసీఆర్ వ్యతిరేక‌త‌, అన్నీ జ‌గ‌న్ అంటూ జ‌గ‌న్మాన స్మర‌ణ మాని… ఇప్పటికైనా నిజాలు చెప్పి ప్రజ‌ల ముంగిట నిలిస్తే త‌గిన తీర్పు ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *