chandrababu

బాబులో అప‌రిచితుడు

న్యూస్

-సొదుం ర‌మ‌ణారెడ్డి
టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు అప‌ర‌చాణ‌క్యుడు. తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. చివ‌రి నిమిషంలో ఏదైనా అద్భుతం చేసి తిరిగి అధికారంలోకి రాగ‌ల మేధోసంప‌త్తి చంద్రబాబు సొంతం….ఈ ప్రశంస‌లన్నీ ఎల్లో మీడియానే కాదు, ప్రత్యర్థులు సైతం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీక‌రించేవే. అయితే ఇవ్వన్నీ గ‌త కాల వైభ‌వ‌మా? అనే అనుమానాలు ఇటీవ‌ల కాలంలో త‌లెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త నాలుగేళ్లుగా ఆయ‌న మాట‌ల్లో, చేతల్లో, నిర్ణయాల్లో, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో అప‌రిప‌క్వత‌, అనాలోచితం, గంద‌ర‌గోళం త‌దిత‌ర అంశాలు కొట్టొచ్చిన‌ట్టు క‌న్పిస్తున్నాయి.

కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న మాట‌లు విన్న త‌ర్వాత అస‌లు ఈ చంద్రబాబుకు ఏమైంది? ఈయ‌న గ‌త కాలపు వ్యూహ‌క‌ర్తైన చంద్రబాబేనా అనే సందేహాల‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు, సొంత పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా అధికారికంగా లేదా అన‌ధికారికంగా పార్టీ, పాల‌నా ప‌గ్గాల‌ను త‌న కుమారుడైన లోకేష్ చేతిలో పెట్టిన త‌ర్వాత చంద్రబాబులో ఒక ర‌క‌మైన అప‌రిచితుడు ప్రవేశించాడ‌నిపిస్తోంది. ఈ రోజు మాట్లాడిన మాట‌ల‌కు రేప‌టికి క‌ట్టుబ‌డి ఉండ‌ని దుస్థితి.

2014లో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న‌లో ఆనందానికి బ‌దులు, ఎందుక‌నో ఆందోళ‌న క‌న్పిస్తోంది. ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మ‌రో మాట‌కు తావులేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ ధ‌ర్నాలు, రాస్తారోకోలు, విద్యాసంస్థల్లో చైత‌న్య కార్యక్రమాలు, ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టి బాబుతో పాటు ప్రధాని మోడీపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అసెంబ్లీ వేదిక‌గా ప్రత్యేకహోదా కావాల్సిందేనంటూ తీర్మానానికి ప‌ట్టుబ‌ట్టాడు.

అయితే బీజేపీతో కేంద్ర‌, రాష్ర్టాల్లో అధికారాన్ని పంచుకుంటున్న చంద్రబాబు… త‌న‌కు అధికారం శాశ్వత‌మ‌ని భావించిన‌ట్టు న‌డుచుకున్నారు. తానొక ప్రజాస్వామ్య వ్యవ‌స్థలో ఉన్నాన‌నే విష‌యాన్ని విస్మరించి, రాజ‌రిక పోక‌డ‌ల‌ను గుర్తుకు తెచ్చేలా వ్యవ‌హ‌రించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదాకు బ‌దులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవ‌డ‌మే కాకుండా… ఆ మాట ఎత్తితే త‌న్ని లోప‌ల ప‌డేశారు. మ‌రికొంద‌రిపై కేసులు బ‌నాయించి త‌న స‌హ‌జ‌శైలిని ప్రద‌ర్శించారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల్లో ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చేస‌రికి అధికార మ‌త్తు వ‌దిలింది.

మోడీతో పాటు త‌న‌పై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేక‌త‌ను ప‌సిగ‌ట్టి త‌న‌కు కూడా ప్రత్యేకహోదా కావాల‌ని గ‌ళ‌మెత్తారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో భేష‌ర‌తుగా రైతుల రుణాల‌ను మాఫీ చేస్తాన‌న్న పెద్దమ‌నిషి, అధికారంలోకి వ‌చ్చాక మాట మార్చారు. తాన‌లా అన‌లేద‌ని, సంపూర్ణ రుణ‌మాఫీ ఎవ‌రూ చేయ‌లేర‌ని రైతుల న‌మ్మకాన్ని వ‌మ్ము చేశారు. టీఆర్ ఎస్‌తో పొత్తుకు త‌హ‌త‌హ‌లాడిన బాబు, అటు వైపు నుంచి రెడ్‌సిగ్నల్ ప‌డ‌టంతో రూటు మార్చారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేసీఆర్‌ను తిట్టిపోశారు.

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను మోడీ ద‌త్త పుత్రుడిగా అభివ‌ర్ణించిన నోటితోనే ఇప్పుడు మ‌చ్చిక చేసుకునేందుకు జో కొట్ట‌డం ప్రారంభించారు. ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకుంటే జ‌గ‌న్‌కు నొప్పేంటి అని ఎదురు ప్ర‌శ్నించ‌డం బాబుకే సొంతం. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో బాబు అనుకున్న‌ట్టు ఎత్తుగ‌డ ఫ‌లించ‌లేదు. ఒక ర‌కంగా ప‌వ‌న్‌కు ఉన్నట్టుండి గుడ్ కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం వ‌ల్ల బాబునే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే ప‌వ‌న్ చేసే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే అర్హ‌త‌ను బాబు అండ్ ఎల్లో టీం కోల్పోయిన‌ట్టే.

ఎప్పుడెవ‌రినో తిడుతారో, ఎప్పుడెవ‌రినో కౌగ‌లించుకుంటారో…ఆ ప‌ని చేసే బాబుకే తెలియ‌ని దుస్థితి. అప‌రిచితుడు సినిమాలో ఓ న‌టుడు నిమిషానికో విధంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు చంద్ర‌బాబు రాజ‌కీయ తెర‌పై జీవిస్తున్నారు. ఒక వైపు వ‌య‌సు పెరుగుతుండ‌టం, కొడుకు స‌మ‌ర్థ‌త‌పై న‌మ్మ‌కం స‌డ‌ల‌డం, తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌నే భ‌రోసా లేక‌పోవ‌డం…త‌దిత‌ర కార‌ణాలు కావ‌చ్చు. ఏదేమైనా చంద్ర‌బాబు కూడా మ‌నిషే క‌దా. అన్నీ బాగున్న‌ప్పుడు అంద‌రూ ఆహా, ఓహో అంటారు. ఏ మాత్రం తేడా క‌నిపించినా చ్చా, చ్చీ అదే నోటితో మూస్తారు.

బ‌హుశా చంద్ర‌బాబుకు భ‌విష్య‌త్ వాణి ఏదో ముందే చెప్పిన‌ట్టుంది. అందుకే ఆయ‌న‌లో ఆ అస‌హ‌నం. ఆయ‌న ఆయ‌న కాదు. ఆయ‌న‌లో మ‌రెవ‌రో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టుంది. ఆ ప్రాణి అభ‌ద్ర‌త‌, అప‌న‌మ్మ‌కం, ఓట‌మి త‌దిత‌ర భ‌యాల‌తో కూడిన‌వై ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *