jagan

ల‌క్ష్యం వైపు పాద‌యాత్రికుడి అడుగులు

న్యూస్

-ఎస్వీ ర‌మ‌ణారెడ్డి
-వైఎస్ జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చ‌రిత్రాత్మకం
-3,648 కిలోమీట‌ర్లు పూర్తి చేసిన వైనం
-జ‌గ‌న్‌లో ప‌రిణ‌తి తీసుకొచ్చిన న‌డ‌క‌
-అధికార సాధ‌న దిశ‌గా ముంద‌డుగు

ప్రజాసంక‌ల్పయాత్ర పేరుతో 2017, న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి ప్రతిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ల‌క్ష్యం నెర‌వేరిందా? అంటే… స‌మాధానం కోసం మ‌రో ఐదునెల‌లు ఎదురు చూడాల్సిందేన‌ని స‌మాధానం చెప్పుకోవాలి. మొత్తం 341 రోజుల పాటు ఆయ‌న పాద‌యాత్ర చేసి 3648 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇచ్ఛాపురం చేరుకున్నారు. అయితే జ‌గ‌న్ ల‌క్ష్యం వేలాది కిలోమీట‌ర్లు న‌డ‌వ‌డం కాదు. పాద‌యాత్రలో వందలాది, వేలాది, ల‌క్షలాది ప్రజ‌ల ఆర్తనాధాలు వింటూ… వాటి ప‌రిష్కారానికి ఎలాంటి మార్గాలు వేయాల‌న్నదే ప్రధాన ఉద్దేశం. ఈ ప‌ని చేయాలంటే అధికారంలోకి రావాలి, వ‌చ్చితీరాలి. అధికార గమ్యాన్ని చేరేందుకే ఈ పాద‌యాత్ర‌.

నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావ‌చ్చు, విభ‌జిత ఆంధ్రప్రదేశ్‌లో కావ‌చ్చు… దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌లు ఎల్లో మీడియా, స్వప‌క్ష‌, ప్రతిప‌క్ష నేత‌ల నుంచి ఎదుర్కొన‌న్ని ఛీత్కారాలు, ప్రతికూల వార్తల రూపంలో వ్యక్తిత్వాల‌ను కించ‌ప‌రిచేలా వ్యక్తిగ‌త దాడుల‌ను మ‌రెవ‌రూ ఎదుర్కొని ఉండ‌రు. వాట‌న్నింటిని త‌ట్టుకొని, తిప్పికొడుతూ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్యమంత్రి వ‌ర‌కు ఎదిగారు. ఆ త‌ర్వాత తిరుగులేని నేత‌గా తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్రవేశారు. ఇప్పుడాయ‌న త‌న‌యుడు తండ్రిలా, తండ్రికి మించి మంచీచెడుల‌ను మూట‌గ‌ట్టుకున్నాడు, మూట‌గ‌ట్టుకుంటున్నాడంటే అతిశ‌యోక్తి కాదు.

2003లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేవెళ్ల నుంచి మొద‌లుపెట్టిన పాద‌యాత్ర మూడునెల‌ల పాటు సాగి 1500-1600 కిలోమీట‌ర్ల దూరం న‌డిచి ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఈ యాత్రలో ల‌క్షలాది మంది ప్రజ‌ల ఆవేద‌న‌లు అసాంతం విని వారికి భ‌రోసా ఇచ్చారు. ఆ త‌ర్వాత తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చి వారి క‌ష్టన‌ష్టాల‌ను పార‌దోలేందుకు అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్రవేశపెట్టి పాల‌న‌లో త‌న‌దైన ముద్రవేశారు. 2009లో తిరిగి అధికారంలోకి రాగ‌లిగారంటే, వైఎస్‌పై ప్రజ‌ల న‌మ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు రాజ‌న్న పాల‌న తీసుకొస్తానంటూ, న‌వ‌రత్నాల పేరుతో అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాల గురించి వైఎస్ జ‌గ‌న్ ఊరూరా విస్తృత ప్రచారం చేస్తున్నారు. సుదీర్ఘ పాద‌యాత్రలో 1.25 ల‌క్షల మందికి పైగా వివిధ వ‌ర్గాల ప్రజ‌ల‌తో ఆయ‌న మ‌మేక‌మ‌య్యారు. ముగింపు స‌భ‌తో క‌లుపుకుని 124 బహిరంగ సభల్లో జ‌గ‌న్ ప్రసంగించి ప్రజ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రజాస్వామిక విధానాల‌పై జ‌నాల్లో తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌నేందుకు, జ‌గ‌న్ స‌భ‌ల‌కు ఇసుకేస్తే నేల రాల‌నంత జ‌నం రావ‌డ‌మే నిద‌ర్శనం. టీడీపీ అధినేత చంద్రబాబు గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల నాడు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ స‌క్రమంగా అమ‌లు చేయ‌క‌పోవ‌డం, మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత‌న లేక‌పోవ‌డం, విచ్చలవిడి అవినీతి, జ‌న్మభూమి క‌మిటీల పేరుతో స్థాన‌క సంస్థల నిర్వీర్యం… ఇలా చెప్పుకుంటూపోతే బాబు ఏలుబ‌డిలో అన్నీ రాక్షల విధానాలే.

ఈ స్థితిలో జ‌గ‌న్ ప్రజాసంక‌ల్పయాత్ర చేప‌ట్టాడు. ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన మ‌హాయాత్ర అడుగు అడుగుకు ఆద‌ర‌ణ రెట్టింపైంది. విశాఖ విమానాశ్రయంలో ఆయ‌న‌పై కోడిక‌త్తి దాడి… అనంత‌రం బాధిత జ‌గ‌న్ వ్యవ‌హ‌రించిన తీరు ఆయ‌న ప‌రిణ‌తిని క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు స‌మాజానికి చూపింది. ఇదే స‌మ‌యంలో ముఖ్యమంత్రి మొద‌లుకుని ఆయ‌న మంత్రివ‌ర్గ స‌భ్యులు, ఇత‌ర టీడీపీ నేత‌లు మాట్లాడిన తీరును స‌భ్యస‌మాజం అస‌హ్యించుకొంది.

అవ్వా, అమ్మా, అక్కా, చెల్లి, అన్నా, త‌మ్ముడు అంటూ ఆప్యాయంగా జ‌గ‌న్ ప్రజ‌ల‌తో మాట్లాడ‌టం… జ‌గ‌న్‌ను జ‌నానికి మ‌రింత చేరువ చేసింది. పాద‌యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్‌పై వ్యక్తిగ‌త విమ‌ర్శలు లాంటి ఒక‌ట్రెండు ఘ‌ట‌న‌లు మిన‌హా మిగిలిన సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ఎంతో హూందాగా వ్యవ‌హ‌రించారు. పాద‌యాత్ర ద్వారా జ‌గ‌న్ ప్రజ‌ల‌తో మ‌మేకం కావ‌డంతో ఆయ‌న వ్యవ‌హార‌శైలిపై ప్రత్యర్థులు చేసే విమ‌ర్శల‌కు నేరుగా స‌మాధానం చెప్పిన‌ట్టైంది. జ‌గ‌న్ పాద‌యాత్రలో ఆయ‌న న‌డ‌క‌ను మాత్రమేకాదు న‌డ‌త‌ను కూడా ప్రజ‌లు ప్రత్యక్షంగా చూసే అవ‌కాశం ల‌భించింది.

నిన్నటికి నిన్న బీజేపీ మ‌హిళా కార్యక‌ర్తపై సీఎం వ్యవ‌హ‌రించిన తీరు, ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ జ‌నంతో మాట్లాడుతున్న తీరును ప్రజ‌లు అంచ‌నా వేసుకునే అవ‌కాశం ల‌భించింది. త‌ద్వారా ఎవ‌రు త‌మ‌కు స‌రైన నేతో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి అధికారం క‌ట్ట‌బెట్టాలో ఓట‌రు నిర్ణయించుకునే సంద‌ర్భం వ‌చ్చింది. ఇచ్ఛాపురం చేర‌డం జ‌గ‌న్ ప్రజాసంక‌ల్పయాత్ర ల‌క్ష్యం కాదు. ఆయ‌న ల‌క్ష్యం తండ్రి మాదిరిగా ప్రజ‌ల‌కు సువ‌ర్ణపాల‌న అంధించ‌డం.

ఆ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు, గ‌మ్యం వైపు గ‌మ‌నం సాగించేందుకు రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునే సంద‌ర్భం ఇది. సుమారు 14 నెల‌ల పాటు ప్రజ‌ల‌తో, ప్రజ‌ల మ‌ధ్య గ‌డిపిన జ‌గ‌న్‌కు వారు ఎన్నో పాఠాల‌ను, గుణపాఠాల‌ను నేర్పారు. వారిచ్చిన ఆద‌ర‌ణ‌, క‌న‌బ‌రిచిన ప్రేమాభిమానాలే త‌న‌ను ఇంత కాలం పాటు న‌డ‌క సాగించేలా చేశాయ‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో జ‌గ‌న్ త‌న మ‌న‌సును ఆవిష్కరించారు.

అధికార సాధ‌న‌కు స‌మాజ‌మ‌నే బ‌డిలో ప్రజ‌లు నేర్పిన పాఠాలు ఎంతో ఉప‌క‌రిస్తాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. జ‌గ‌న్‌కు అధికారం క‌ట్టబ‌ట్టేది ఆయ‌న న‌డ‌క మాత్రమే కాదు న‌డ‌త కూడా. అందుకే జ‌గ‌న్ ప్రతి మాట ఆచితూచీ మాట్లాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *