Kcrku gatti potinicchena

కేసీఆర్ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌లు

పొలిటికల్

కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఈ ద‌ఫా మహిళలకు చోటు దక్కే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ముగ్గురు మహిళలు ఎన్నిక కాగా, వారందరికీ పదవీయోగం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వారికి ప్రాధాన్యం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకరికి మంత్రిపదవి, ఇంకొకరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖాయం కాగా, డిప్యూటీ స్పీకర్ స్థానానికి సైతం వారిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

శాసనసభ ఎన్నికల్లో మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి, ఖానాపూర్ నుంచి రేఖానాయక్‌, ఆలేరు నుంచి గొంగిడి సునీత టీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పద్మాదేవెందర్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్, సునీతకు విప్‌ పదవులు లభించాయి. అప్పట్లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించారు. అయితే మంత్రివ‌ర్గంలో మాత్రం మహిళలకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఒక మహిళకు ప్రాతినిథ్యం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ జాబితాలో పద్మా దేవేందర్‌రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన‌ అనుభవం ఆమెకు కలిసివస్తోంది. ఒకవేళ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే ఎస్టీ, మహిళా కేటగిరీ రెండూ కలిసొచ్చి రేఖానాయక్‌ను మంత్రిపదవి వరించే సూచనలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌ రెడ్డి పనితీరుపై కేసీఆర్ సంతృప్తిగా ఉండటంతో ఈ దఫా స్పీకర్‌గా ఎంపిక చేయాలని అనుకుంటున్నారు.

ఒకవేళ సభాపతి పదవిని ఆమె తిరస్కరిస్తే మరొకరిని అందులో నియమించి, సునీత, రేఖల్లో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌ను చేయాలనే ప్రతిపాదన ఉంది. మరోవైపు, ఇతర పార్టీలకు చెందిన కొందరు మహిళా సభ్యులు టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం సాగుతోంది. వారికి కూడా కీలక పదవులు కట్టబెడతామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు సమాచారం. వారి చేరికలపై స్పష్టతవస్తే మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శుల పదవుల ఎంపిక వాయిదా పడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *