ఉమ్మడి హైకోర్టు విభజనకు రంగం సిద్ధం..

న్యూస్

ఉమ్మడి హైకోర్టు విభజనకు రంగం సిద్ధం.. జనవరి నుంచి వేర్వేరు కోర్టులు!

వేరు కానున్న ఏపీ, తెలంగాణ హైకోర్టులో

సంక్రాంతి తర్వాతి నుంచి ఏపీలో కేసుల విచారణ

ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి నోటిఫికేషన్

రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా హైకోర్టు మాత్రం ఇంకా ఉమ్మడిగానే ఉంది.

హైకోర్టు విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చాయి. విభజనకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

జనవరి ఒకటో తేదీ నుంచే రెండు రాష్ట్రాల హైకోర్టులు వేరవుతాయి. సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో వేర్వేరుగా పనిచేయడం ప్రారంభిస్తాయి.

హైకోర్టు విభజనకు సంబంధించిన రాష్ట్రపతి నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అంతకంటే ముందే హైకోర్టు విభజన, జోనల్ వ్యవస్థలకు ఆమోదం పొందాలని కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. హైకోర్టు విభజన, ఇతర అంశాలపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌తో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ తదితరులు సమావేశమై హైకోర్టు విభజనపై చర్చించారు.

అయితే, నవ్యాంధ్రలో ఏర్పాట్లు పూర్తయిన తర్వాతే హైకోర్టును విభజించాలని ఉమ్మడి కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును వేణుగోపాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అమరావతిలోని నేలపాడు, తుళ్లూరు గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న జుడీషియల్ కాంప్లెక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

గత శనివారం నిర్మాణ పనులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కైత్‌, జస్టిస్‌ సీతారామమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు ఈ భవన సముదాయం సరిపోతుందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.

ఈ భవన నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయి. కాబట్టి జనవరి 1 నాటికి హైకోర్టును విభజించి, సంక్రాంత్రి తర్వాత పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఈ మేరకు మరో ఒకటి రెండు రోజుల్లోనే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే అకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *