ప్రేక్షకులను మెప్పించే నర్తనశాల

సినిమా

”నర్తనశాల’ టైటిల్‌ పెట్టి, సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. క్లాసిక్‌ సినిమా టైటిల్‌ పెట్టి సమకాలీన అంశాలతో వినోదాన్ని పంచడమనేది చాలా కష్టం. ఎంటర్‌టైన్‌మెంట్‌ పర్వం ‘గీత గోవిందం’తో ప్రారంభమైంది. ‘నర్తనశాల’తో అది కొనసాగాలని కోరుకుంటున్నా’ అని దర్శకుడు వంశీపైడిపల్లి అన్నారు.
నాగశౌర్య, కశ్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నర్తనశాల’. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శుక్రవారం వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన వంశీపైడిపల్లి సినిమా మొదటి టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘దర్శకుడు శ్రీనివాస్‌ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. తను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నాగశౌర్య ఇప్పటికీ ఫోన్‌ వాడడు. అలా ఉండటం చాలా కష్టం. తల్లిదండ్రులు ఉష, శంకర్‌ ప్రసాద్‌ నాగశౌర్యకు మంచి సపోర్ట్‌ అందిస్తున్నారు. అజరు పాత్ర చాలా బాగుంటుంది. ఈ నెల 30న విడుదల కాబోతున్న సినిమా అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అని అన్నారు.
‘ఐరా క్రియేషన్స్‌కి ఉష, శంకర్‌ ప్రసాద్‌, బుజ్జి, గౌతమ్‌ నాలుగు పిల్లర్స్‌. శౌర్య కథ విన్న వెంటనే నాతో చెప్పాడు. కచ్చితంగా హిట్‌ కొడుతున్నాం అన్నాడు. నా ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాగర్‌ మహతి సినిమా కోసం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు. అర్జెంట్‌గా నెక్ట్స్‌ శౌర్యతో సినిమా చేయాలనుంది’ అని దర్శకురాలు నందిని రెడ్డి తెలిపారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘నాపై, సినిమాపై అభిమానంతో ఇక్కడికి వచ్చిన అభిమానులకు థ్యాంక్స్‌. మీడియా నన్ను ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తూ వస్తోంది. ‘ఛలో’ నుంచి ప్రోత్సహిస్తున్న వంశీపైడిపల్లి అన్నకు కృతజ్ఞతలు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాగర్‌ మహతి ‘ఛలో’ కంటే పెద్ద హిట్‌ సాంగ్స్‌ చేయాలంటే బుద్ది తక్కువతనం అవుతుంది. మా ప్రొడక్షన్‌ నుంచి ఆ పాటను మించే పెద్ద పాట రావాలని కోరుకుంటున్నా. ఇందులో ‘ఎగిరినే ..’ పాట పెద్ద హిట్‌ అయ్యింది. దర్శకుడు శ్రీనివాస్‌ చెప్పింది చెప్పినట్టు తీశారు. మా తల్లిదండ్రుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నా కంటే మా అమ్మానాన్నలకే ఫ్యాన్స్‌ ఎక్కువగా ఉన్నట్టున్నారు (నవ్వుతూ). మా ఫ్యామిలీకి సపోర్ట్‌గా నిలుస్తున్న బుజ్జి, శ్రీనివాస్‌ రెడ్డిలకు ధన్యవాదాలు. సినిమా మాకు నచ్చింది. ఆడియెన్స్‌కి కూడా నచ్చుతుంది. నచ్చితే పదిమందికి చెప్పండి, నచ్చకపోతే చూడొద్దు’ అని చెప్పారు. ‘ఫస్ట్‌ అవకాశం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శంకర్‌ ప్రసాద్‌, ఉషా, నాగశౌర్యకి థ్యాంక్స్‌. సినిమా కామిక్‌గా ఉంటుంది. వేగంగా పూర్తవడానికి ఎడిటింగ్‌లో సంతోష్‌, మ్యూజిక్‌లో విక్కీ కారణం. వారికి ధన్యవాదాలు’ అని దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి చెప్పారు. ‘మాకు ఛాన్స్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’ అని హీరోయిన్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *