ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదు

పొలిటికల్
     అఖిలపక్ష నాయకులతో ఈసి రజత్‌కుమార్‌ సమావేశం
హైదరాబాద్‌ :   ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు జోరందుకున్న నేపధ్య లో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో అఖిలపక్ష యకులతో సచివాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. అయితే, ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఈఓ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే చర్చలు జరగాయని తెలిపారు. ఇది సాధారణ సమావేశం మాత్రమేనన్నారు. ఎన్నికల కమిషన్‌ను సంప్రదించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తారని తెలిపారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చినా తాము సిద్దమేనని వెల్లడించారు. బ్యాలెట్‌ మిషన్లు, వివి పాట్‌ మిషన్లు నవంబరు కల్లా సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినా 2018 జనవరి ఓటర్స్‌ లిస్ట్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నామినేషన్లకు పది రోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందనీ, 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందొచ్చని తెలిపారు. సీఈఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని ఇప్పుడిప్పుడే ఇస్తున్నారని చెప్పారు.సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని అన్నారు. అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసీని కోరామని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కాకుండా మిగిలిన వారి ఓట్లు తొలగించారని ఆరోపించారు.బదిలీ చేసిన 7 మండలాల్లోని ప్రజలు ఇంకా తెలంగాణ ఓటర్లుగానే ఉన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అనుకోవడం లేదని శశిధర్‌ రెడ్డి అన్నారు. జూలై 28న ఇచ్చిన ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యం తరాలు చెప్పమన్నారని బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలపై  సీఈఓను అడగగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్టు ఆయన వెల్లడించారు. సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *