క‌ల్వ‌కుంట్ల నెత్తిన ధిక్కార‌ “కొండ‌”

పొలిటికల్

ఎవ‌డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో వాడే పండుగాడ‌ని పోకిరి సినిమాలోని డైలాగ్ ఎంతో పాపుల‌ర్ అయ్యింది. స‌రిగ్గా ఈ రోజు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి కూడా కొండా కుటుంబం నుంచి అలాంటి దెబ్బే త‌గిలి మైండ్ బ్లాంక్ అయ్యే ప‌రిస్థితి. మొత్తానికి త‌న‌కు ఎదురే లేద‌ని చెల‌రేగిపోతున్న‌ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్రావు నెత్తిన‌ కొండా సురేఖ దంపతుల రూపంలో ధిక్కార కొండ ప‌డింది. హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో త‌న భ‌ర్త కొండా ముర‌ళీధ‌ర్‌రావుతో క‌ల‌సి సురేఖ విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ కుటుంబంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఆమె విరిసిన ప్ర‌తి ప్ర‌శ్న కేసీఆర్ టీంలో వ‌ణుకు పుట్టించేలా ఉంది.

రెండురోజుల క్రితం టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో వ‌రంగ‌ల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేక‌పోవ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే ఇప్పుడు కొండా దంప‌తుల తిరుగుబాటుకు కేంద్ర‌బిందువైంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం కొండా సురేఖ‌కు అభిమానులున్నారంటే అతిశ‌యోక్తి కాదు. దీనికి ఆమె వ్య‌క్తిత్వ‌మే కార‌ణం. న‌మ్మిన వారి కోసం ప్రాణాలైనా అర్పించేందుకు వెనుదీయ‌ని కొండా దంప‌తుల విశ్వ‌స‌నీయ‌త తెలుగు ప్ర‌జ‌ల్లో అభిమానుల‌ను సంపాదించి పెట్టింది. ఈ న‌మ్మ‌కం, విశ్వాసాలే వారి ఆస్తిపాస్తులు. కొండా దంప‌తుల రాజ‌కీయ పంథాపై ఎవ‌రికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కాని తాము నమ్మిన వారి కోసం వారు ప్ర‌ద‌ర్శించే ప్రేమాభిమానాలు వెల‌క‌ట్ట‌లేనివి.

వ‌రంగ‌ల్‌కు చెందిన కొండా దంప‌తుల‌కు వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చారు. ఈ ఒక్క కార‌ణ‌మే వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం కూడా వారిని ఆ కుటుంబం వెంట న‌డిచేలా చేసింది. ముఖ్య‌మంత్రి రోశ‌య్య కేబినెట్‌లో తాను మంత్రిగా ఉండ‌లేన‌ని ఆమె త్రుణ‌ప్రాయంగా ప‌ద‌విని త్య‌జించింది. వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరి అండ‌గా నిలిచారు. రోశ‌య్య పాల‌న‌లో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. ఆ స‌మ‌యంలో కూడా వైఎస్ జ‌గ‌న్ కోసం ఆమె ప‌ర‌కాల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి త‌న నిబ‌ద్ధ‌త‌త‌ను చాటుకున్నారు. 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో వైసీపీ నుంచి ఆమె పోటీ చేసి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి భిక్ష‌ప‌తికి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు చుక్క‌లు చూపారు. తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న ఆ రోజుల్లో కూడా కేవ‌లం 1562 ఓట్ల తేడాతో ఆమె పోరాడి ఓడారు. కాని నైతికంగా ఆమే విజ‌యం సాధించార‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో వైసీపీ తెలంగాణ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో కొండా దంప‌తులు పార్టీ నుంచి బ‌య‌ట‌కెళ్లారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆమె టీఆర్ ఎస్‌లో చేరి వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న త‌రుణంలో టీఆర్ ఎస్ ఆమెకు టికెట్ నిరాక‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆమె శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో ఘాటుగా స్పందించారు. ఈ స‌మావేశంలో ఏమ‌న్నారో ఆమె మాటల్లోనే…

“తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదు. మాకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సత్తా ఉంది. నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కేటీఆరే కారణం. మొదటి నుంచి మ‌మ్మ‌ల్నిఇబ్బంది పెడుతున్నదీ కేటీఆరే . టీఆర్‌ఎస్‌లో కేటీఆర్ కోటరీని తయారు చేసుకుంటున్నారు. తెలంగాణను ఆగం పట్టించేందుకు ఒక టీమ్‌ను తయారు చేస్తున్నారు. మాకు డబుల్‌ గేమ్‌ ఆడాల్సిన అవసరం లేదు. మాతో పాటు మా డ్రైవ‌ర్ల ఫోన్ల‌ను ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం కేసీఆర్ స‌ర్కార్‌కు ఏమ‌వ‌స‌రం వ‌చ్చింది.

కొండా సురేఖ‌కు టిఆర్ఎస్ కండువా క‌ప్పుతున్న కెసిఆర్‌ (ఫైల్ ఫోటో )

తెలంగాణ‌కు రాహుల్ వ‌చ్చినా, అమిత్‌షా వ‌చ్చినా మా ఫోన్ల‌పై నిఘానా? ఇదెక్క‌డి న్యాయం. మేము ఏం చేసినా నేరుగా చేస్తాం. అంతే త‌ప్ప దొంగ‌చాటు వ్య‌వ‌హారాలు మా చేత‌కాదు. బీసీ మ‌హిళ‌నైన నాకు సీటు ఇవ్వకపోవడం న‌న్ను మాత్ర‌మే అవ‌మానించిన‌ట్టు కాదు. మ‌హిళ‌ల‌తో పాటు బీసీలంద‌రినీ అవమానించడమే. మహిళల పాత్ర లేకుండానే తెలంగాణ వచ్చిందా? . బీసీ, ఎస్సీ మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని పొమ్మనలేక పొగబెట్టారు. టీఆర్‌ఎస్‌ పెద్దలు చెప్పే సమాధానంపై మా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుంది. అవసరమైతే మూడు చోట్ల ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాం” అని ఆమె త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

న‌మ్మ‌కానికి ప్ర‌తిరూపం కొండా సురేఖ అనే పేరు. అహంకారానికి, నియంతృత్వానికి పోత‌పోస్తే కేసీఆర్‌, కేటీఆర్ అవుతార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ మాట తీరు, బాడీ లాంగ్వేజీని బాగా ప‌రిశీలిస్తే నియంత ల‌క్ష‌ణాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇక ఆయ‌న కుమారుడు కేటీఆర్ తండ్రికి మించిన త‌న‌యుడే. ఇప్పుడు క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై కొండా సురేఖ దంప‌తులు బ‌హిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఈ తిరుగుబాటు వారికే ప‌రిమిత‌మ‌ని చెప్ప‌లేం.

ఒక‌ప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చార‌ని సీఎం చంద్ర‌బాబుపై తిరుగుబాటు చేసి తెలంగాణ ఉద్య‌మాన్ని కేసీఆర్ త‌ల‌కెత్తుకున్నారు. తెలంగాణ స‌మాజం యావ‌త్తు అండ‌గా ఉండ‌టంతో కొన్నేళ్ల‌కు వారి క‌ల సాకార‌మైంది. ఇప్పుడు తెలంగాణను సాధించుకొంది కేవ‌లం త‌న కుటుంబం కోస‌మే అనే భావ‌న‌తో కేసీఆర్ విర్ర‌వీగుతున్నారు.

గులాబీ పార్టీ అంటే గులాం గిరి చేయించుకునే వారిగా టీఆర్ ఎస్ అగ్ర‌నేత‌ల వ్య‌వ‌హార శైలి ఉంది. కొండా సురేఖ ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలంగాణ అంటే క‌ల్వ‌కుంట్ల కుటుంబం కాద‌నే వాస్త‌వాన్ని కేసీఆర్ గుర్తించి నేల దిగి న‌డుచుకోవాలి. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే నియంత‌ల‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ స‌మాజానికి తెలిసినంత‌గా మ‌రొక‌రికి తెలియ‌దు. జాగ్ర‌త్త కేసీఆర్‌… బండెన‌క బండి క‌ట్టి ఏ బండ్లో పోత‌వ్ కొడుకో అని వెంట‌ప‌డే రోజు తెచ్చుకోకు అని కొండా సురేఖ మాట‌లు హెచ్చ‌రిస్తున్నాయి.

                                              – దివిజ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *